Ind Vs Ban: క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలిచిన అశ్విన్‌, జ‌డేజాలపై స‌చిన్‌, కుంబ్లే ప్ర‌శంస‌లు

Sachin Tendulkar and Anil Kumble Ultimate Tribute To Ashwin and Ravindra Jadeja

  • చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌, భార‌త్ తొలి టెస్టు
  • అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న అశ్విన్, జ‌డేజా
  • అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యం అందించిన ఆల్‌రౌండ‌ర్లు
  • అశ్విన్ అజేయ శ‌త‌కం (102), జ‌డ్డూ (86 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌
  • ఈ ద్వ‌యంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు

చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆల్‌రౌండ‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీండ్ర జ‌డేజాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 144 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 6 వికెట్లు కోల్పోయి భార‌త జ‌ట్టు క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉండ‌గా ఈ ద్వ‌యం ఆదుకుంది. 

అశ్విన్ అజేయ శ‌త‌కం (102)తో చెల‌రేగాడు. అత‌నికి జ‌డ్డూ (86 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌తో తోడ్పాటు అందించాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు ఆల్‌రౌండర్లు అజేయంగా నిలిచారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భార‌త్‌ 339/6 వద్ద ఉంది. అశ్విన్ (102 నాటౌట్‌), జడేజా (86 నాటౌట్‌) అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఇలా తమ ఎదురుదాడి భాగస్వామ్యంతో భారత్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు ఈ ఇద్ద‌రు ఆల్‌రౌండ‌ర్ల‌ను భారత దిగ్గజ క్రికెట‌ర్లు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే ప్రశంసించారు. 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వీరిని మెచ్చుకుంటూ స‌చిన్‌, కుంబ్లే పోస్టులు పెట్టారు. 

"నిరాశ నుండి ఆధిపత్యానికి! ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజాల నాక్స్‌ మరోసారి టీమిండియా ఆటుపోట్లను తిప్పికొట్టాయి. ఈ ఆల్ రౌండ్ బ్రిలియన్స్ అమూల్యమైంది. సూపర్ పార్టనర్‌షిప్ బాయ్స్" అని సచిన్ ట్వీట్ చేశాడు. 

"అశ్విన్ అద్భుత‌మైన‌ సెంచరీకి తోడుగా ర‌వీంద్ర‌ జడేజా అజేయ‌ ఇన్నింగ్స్ భార‌త జ‌ట్టు గేమ్‌ను మార్చింది. క‌ష్ట స‌మ‌యంలో కీల‌క భాగ‌స్వామ్యం అందించారు. వారి సంకల్పం, భాగస్వామ్యం చాలా ముఖ్యమైనవి" అని అనిల్ కుంబ్లే త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

అటు ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ మైఖేల్ వాన్ కూడా ఈ ద్వ‌యంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. "సీరియస్ క్రికెటర్లు.. అశ్విన్‌, జ‌డేజా సొంత గ‌డ్డ‌పై తరచుగా బ్యాట్‌తో మాయాజాలం చేస్తారు. బంతితో కూడా మాయ చేయ‌గ‌ల‌రు. అందులో ఎలాంటి సందేహం లేదు" అని ట్వీట్ చేశారు. 

ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో భారత్ 34/3 వద్ద నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 9 ఫోర్లతో 56), రిషబ్ పంత్ (52 బంతుల్లో 39, ఆరు ఫోర్లతో) నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియాను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

కానీ, వారి నిష్క్ర‌మ‌ణ త‌ర్వాత‌ భారత్ మ‌ళ్లీ త‌డ‌బ‌డింది. 144 ర‌న్స్‌కే 6 వికెట్లు పారేసుకుని మ‌ళ్లీ క‌ష్టాల్లో ప‌డింది. ఇలా టీమిండియా కుప్పకూలిన స‌మ‌యంలో అశ్విన్ (102 నాటౌట్‌), జడేజా (117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 86*) అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఆదుకున్నారు. దీంతో రోహిత్ సేన మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి  339/6 వద్ద పటిష్ఠ స్థితిలో నిలిచింది.

  • Loading...

More Telugu News