soldier Rescued: మంచు కింద కూరుకుపోయిన భారత సైనికుడు... 3 రోజుల తర్వాత సురక్షితంగా బయటికి తీసుకువచ్చిన రెస్క్యూ టీమ్

soldier who trapped under snow for three days is Rescued

 


భారత్-చైనా సరిహద్దులో మంచు కింద కూరుకుపోయిన ఓ సైనికుడిని దాదాపు మూడు రోజుల తర్వాత భద్రతా బలగాలు కాపాడాయి. భారత్‌-చైనా సరిహద్దులో గస్తీ కోసం వెళ్లిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ టీమ్‌కు చెందిన సైనికుడు అనిల్ రామ్, వస్తు సామగ్రి మోయడంలో సాయంగా వెళ్లిన దేవేంద్ర సింగ్ అనే వ్యక్తి ఇద్దరూ మంగళవారం నాడు దారితప్పారు. 

విపరీతమైన హిమపాతం కారణంగా దారి కనిపించే పరిస్థితి లేకపోవడంతో వారు మంచు గుప్పిట్లో చయక్కుకుపోయారు. ఉత్తరఖండ్‌లోని మున్సియారీ గ్రామానికి 84 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయారు. కఠినమైన శీతల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న వారిద్దరూ ఆ రోజు రాత్రంతా ఒక గుహలో తలదాచుకున్నారు. ఆ గుహను కూడా మంచు కప్పేసింది. 

దీంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. సైనికుడు, అతడితో పాటు ఉన్న వ్యక్తిని రక్షించడమే లక్ష్యంగా అన్వేషించింది. దాదాపు 36 గంటల తర్వాత ఇద్దరి జాడను బృందం గుర్తించింది.  

రెస్క్యూ బృందం విజయవంతంగా ఇద్దరినీ గుహ నుంచి బయటకు తీసుకువచ్చింది. అనిల్‌ను రక్షించేందుకు బలగాలు కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శ్రేష్ట్ గున్సోలా వెల్లడించారు. 

రెస్క్యూ టీమ్ ప్రయత్నాలకు అభినందనలు అని ఆయన పేర్కొన్నారు. 4 అడుగుల లోతు మంచులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారని వెల్లడించారు.

కాగా అనిల్ రామ్ బీహార్‌లోని బక్సర్‌కు చెందినవారు. మున్సియారీ నుంచి మిలాం వరకు గస్తీ నిర్వహించేందుకు సరిహద్దుకు వెళ్లారు. క్షేమంగా బయటపడ్డారని సమాచారం అందడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన సోదరుడు అనిల్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని సోదరుడు గాంధీ కుమార్ వెల్లడించారు.


  • Loading...

More Telugu News