Kamindu Mendis: కమిందు మెండిస్ సూప‌ర్‌ శ‌త‌కం.. ఒకేసారి ఐదు రికార్డులు సొంతం.. ఏకంగా బ్రాడ్‌మ‌న్ స‌ర‌స‌న యువ ఆట‌గాడు!

5 records created by Kamindu Mendis in his 114 run knock for Sri Lanka in SL vs NZ 2024 1st Test

  • సూప‌ర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న శ్రీలంక యంగ్ ప్లేయ‌ర్ కమిందు మెండిస్
  • గాలే వేదిక‌గా కివీస్‌తో జరుగుతోన్న మొదటి టెస్టులో శతకం
  • కనీసం పది ఇన్నింగ్స్‌లు ఆడిన ఆసియా బ్యాటర్లలో అత్యధిక స‌గ‌టు కలిగిన ప్లేయ‌ర్‌గా కమిందు
  • ప్రతి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి శ్రీలంక క్రికెటర్‌
  • డబ్ల్యూటీసీ సైకిల్‌లో అత్యుత్తమ సగటు న‌మోదు చేసిన యువ ఆట‌గాడు
  • దిముత్‌ కరుణరత్నెతో సమంగా క‌మిందు మెండిస్

శ్రీలంక యువ‌ క్రికెటర్ కమిందు మెండిస్‌ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. గాలే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మొదటి టెస్టులో శతకం బాదిన కమిందు ఒకేసారి ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 173 బంతుల్లో 114  ప‌రుగులు చేశాడు. ఇలా సూప‌ర్ శ‌త‌కంతో కీలక ఇన్నింగ్స్ ఆడిన‌ అతడు సాధించిన ఆ ఐదు రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా క్రికెటర్లలో టాప్..
పాతికేళ్ల‌ కమిందు మెండిస్‌ ఇప్పటివరకు ఏడు టెస్టు మ్యాచులు మాత్రమే ఆడాడు. మొత్తం 11 ఇన్నింగ్స్‌ల‌లో క‌లిపి 809 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచ‌రీలు ఉన్నాయి. అతడి బ్యాటింగ్‌ సగటు 80.90. కనీసం పది ఇన్నింగ్స్‌లు ఆడిన ఆసియా బ్యాటర్లలో అత్యధిక స‌గ‌టు కలిగిన ప్లేయ‌ర్‌గా ఉన్నాడు. గ‌తంలో భారత యువ ఆట‌గాడు యశస్వి జైస్వాల్ 68.53 సగటుతో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

తొలి శ్రీలంక క్రికెటర్‌గా అరుదైన ఘ‌న‌త‌..
కమిందు ఏడు టెస్టుల్లో అంటే ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం అర్ధ శతకం బాదాడు. ఇలా ప్రతి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి శ్రీలంక క్రికెటర్‌ అతడే.

దిగ్గజ క్రికెటర్ డాన్‌ బ్రాడ్‌మ‌న్‌తో సమంగా..
శ్రీలంక బ్యాటర్ మెండిస్ 11 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచ‌రీలు న‌మోదు చేశాడు. ఇందులో బంగ్లాపై రెండు, ఇంగ్లాండ్‌పై ఒకటి, కివీస్‌పై ఇంకోటి ఉన్నాయి. ఈ క్రమంలో వేగంగా నాలుగు శ‌త‌కాలు బాదిన తొలి శ్రీలంక బ్యాటర్‌గా అవ‌త‌రించాడు. క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా లెజెండ‌రీ బ్యాట‌ర్‌ డాన్‌ బ్రాడ్‌మ‌న్‌ కూడా తన మొదటి నాలుగు సెంచ‌రీలను 11 ఇన్నింగ్స్‌ల‌లోనే సాధించాడు. దీంతో కమిందు మెండిస్ బ్రాడ్‌మ‌న్‌ సరసన చేరాడు.

డబ్ల్యూటీసీ సైకిల్‌లో అత్యుత్తమ సగటు..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో కనీసం 10 ఇన్నింగ్స్‌ కన్నా ఎక్కువగా ఆడిన బ్యాటర్లలో క‌మిందు మెండిస్‌దే అత్యుత్తమ స‌గ‌టు కావ‌డం గ‌మనార్హం. ప్రస్తుతం అత‌ని సగటు 80.90గా ఉంది. రెండో సీజన్ 2021-23లో న్యూజిలాండ్ ప్లేయ‌ర్‌ కేన్‌ విలియమ్సన్‌ 75.2 సగటుతో పరుగులు చేశాడు. ఇప్పుడు మెండిస్‌ మూడో సీజన్‌లో కేన్ మామ‌ను దాటేశాడు.

దిముత్‌ కరుణరత్నెతో సమంగా క‌మిందు మెండిస్..
ఒకే డబ్ల్యూటీసీ సీజన్‌లో లంక బ్యాటర్‌ దిముత్‌ కరుణరత్నె ఇప్పటివరకు ఎక్కువ శతకాలు బాదిన ఆట‌గాడిగా ఉన్నాడు. ఇప్పుడు అతడితో సమంగా క‌మిందు మెండిస్ నిలిచాడు. దిముత్ 2019-21 సీజ‌న్‌లో నాలుగు సెంచ‌రీలు న‌మోదు చేశాడు. మెండిస్‌ 2023-25 సీజన్‌లో ఇప్పటికే నాలుగు శ‌త‌కాలు సాధించ‌డం విశేషం. మరో సెంచ‌రీ కొడితే అతడే అగ్ర‌స్థానంలో ఉంటాడు. ఒక‌వేళ ఇదే ఫామ్‌ను కొన‌సాగిస్తే రాబోయే మ్యాచ్‌ల‌లో దిముత్‌ కరుణరత్నె రికార్డును క‌మిందు మెండిస్ బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయమ‌ని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News