Balineni Srinivasa Reddy: రేపు పవన్ కల్యాణ్ ను కలుస్తున్న బాలినేని... రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు అని వ్యాఖ్య

Balineni Srinivasa Reddy to meet Pawan Kalyan

  • వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని
  • పవన్ ను కలిసిన తర్వాత జనసేనలో చేరే తేదీని ప్రకటించనున్న బాలినేని
  • రాజకీయాల్లో భాష గౌరవంగా ఉండాలని వ్యాఖ్య
  • జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించానన్న బాలినేని

ఎన్నికల తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న వైసీపీకి ఈరోజు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. 

రేపు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను బాలినేని కలవనున్నారు. పవన్ ను కలిసిన తర్వాత జనసేనలో ఎప్పుడు చేరాలనే తేదీపై ఆయన నిర్ణయం తీసుకుంటారు. జగన్ కు బంధువైన బాలినేని వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణులు షాక్ కు గురవుతున్నాయి.

మరోవైపు, మీడియాతో బాలినేని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు వేరు... బంధుత్వం వేరు అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు తాను వ్యతిరేకించానని చెప్పారు. విలువలను నమ్ముకుని తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. రెండుసార్లు మంత్రిగా పని చేశానని చెప్పారు. 

రాజకీయాల్లో మనం మాట్లాడే భాష గౌరవంగా ఉండాలని బాలినేని అన్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని అన్నారు. కొన్ని కారణాల వల్ల తాను వైసీపీని వీడుతున్నానని చెప్పారు. తన వద్దకు ఎవరు వచ్చినా రాజకీయాలకు అతీతంగా సాయం చేశానని తెలిపారు. ప్రజల తీర్పు తనకు శిరోధార్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News