Seethakka: మంత్రి సీతక్క నియోజకవర్గంలో తొలి కంటెయినర్ ప్రభుత్వ స్కూల్
- జిల్లాలోని కన్నాయిగూడెం మండలం కాంతనపల్లి అటవీ ప్రాంతంలో ఏర్పాటు
- కొత్త పాఠశాల భవనానికి అనుమతులు నిరాకరించిన అటవీశాఖ
- కంటెయినర్ పాఠశాలకు శ్రీకారం చుట్టిన మంత్రి
మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గంలో ప్రభుత్వ కంటెయినర్ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారి ఏర్పాటు చేసిన ఈ స్కూల్‌ను సీతక్క నేడు ప్రారంభించారు. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామంలో ప్రస్తుతం గుడిసెలో ఉన్న పాఠశాల శిథిలావస్థకు చేరడంతో కంటెయినర్ పాఠశాలను ఏర్పాటు చేశారు.
ఇక్కడ కొత్త పాఠశాల భవనానికి అటవీ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో మంత్రి సీతక్క కంటెయినర్ పాఠశాలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు, తాడ్వాయి మండలంలో కంటెయినర్ ఆసుపత్రిని మంత్రి అందుబాటులోకి తీసుకువచ్చారు.
స్థానిక ప్రజల అభివృద్ధి కోసం అటవీ నిబంధనలను సరళతరం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు అనుగుణంగా అటవీ చట్టంలో మార్పులు చేయాలని కోరారు.
తాగునీటి పైపులు, విద్యుత్ లైన్లు, రోడ్లు, ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు అటవీ నిబంధనలు ఆటంకంగా మారినట్లు తెలిపారు. ఆదివాసీలకు కనీసం విద్య, వైద్య సేవలు అందేలా అటవీ చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు.
మైనింగ్ కోసం నిబంధనలు సడలిస్తున్న కేంద్రం... ప్రజా సంక్షేమం కోసం నిబంధనలు సరళతరం చేయకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.