Narendra Modi: ఈ నెల 21 నుంచి అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi will tour in USA from September 21

  • అమెరికాలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోదీ
  • ఈ నెల 21న క్వాడ్ దేశాల సదస్సుకు హాజరు
  • ఈ నెల 23న ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరు

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 21 నుంచి 23 వరకు మూడ్రోజుల పాటు అగ్రరాజ్యంలో ఆయన పర్యటన సాగనుంది. విల్మింగ్టన్ లో జరిగే 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. 

సెప్టెంబరు 21న జరిగే క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమివ్వనున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలకు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించడంపై ఈ క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు. కాగా, వచ్చే ఏడాది క్వాడ్ దేశాల సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అంగీకరించింది. 

అమెరికాలో జరిగే తాజా క్వాడ్ సమావేశంలో, బైడెన్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ మరోమారు పోటీ చేయడంలేదన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు కూడా వీడ్కోలు పలకనున్నారు. క్వాడ్ దేశాల గ్రూప్ లో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 

ఇక, క్వాడ్ సదస్సు అనంతరం, ప్రధాని మోదీ ఈ నెల 23న న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. మెరుగైన రేపటి కోసం విభిన్న పరిష్కారాలు అనే అంశంపై ఈ ఐరాస సమావేశం ఏర్పాటు చేశారు. 

ఐరాస సమావేశాలకు వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News