Mamata Banerjee: కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ కేసులో కీల‌క ప‌రిణామం.. జూనియర్ డాక్టర్లతో సీఎం చర్చలు.. పోలీస్‌ కమిషనర్‌పై వేటుకు అంగీకారం!

Will replace Kolkata Police Commissioner today says West Bengal CM Mamata Banerjee

  • ఆర్‌జీ క‌ర్ ఆసుప‌త్రి ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార ఘ‌ట‌న‌పై జూనియ‌ర్ వైద్యుల ఆందోళ‌న‌
  • సోమ‌వారం వైద్య విద్యార్థుల‌తో సీఎం మ‌మ‌త భేటీ
  • 42 మంది వైద్యుల బృందం సీఎం ఇంటికి వెళ్లి చ‌ర్చ‌లు
  • కోల్‌కతా పోలీస్‌ కమిషనర్, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్ తొలగింపు

ఆర్‌జీ క‌ర్ ఆసుప‌త్రి ట్రైనీ డాక్ట‌ర్‌పై జ‌రిగిన హ‌త్యాచార ఘ‌ట‌న‌పై కోల్‌కతాలో దాదాపు నెల‌రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల మెజార్టీ డిమాండ్లు నెరవేర్చేందుకు సీఎం మమతా బెనర్జీ అంగీకరించారు. బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్న వైద్యుల‌ను ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సోమ‌వారం ఐదోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించారు. 

మొత్తం 42 మంది వైద్యుల బృందం ముఖ్య‌మంత్రి ఇంటికి వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపింది. దాదాపు ఆరు గంటలకుపైగా జూనియర్‌ వైద్యులతో సోమవారం రాత్రి చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా మ‌మ‌త ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. వైద్యుల‌ డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీస్‌ కమిషనర్ వినీత్ గోయెల్‌, ఆరోగ్య సేవల డైరెక్టర్ దేబాసిశ్ హ‌ల్డ‌ర్‌, వైద్య విద్య డైరెక్టర్ కౌస్త‌వ్ నాయ‌క్‌ల‌ను తొలగిస్తామని ప్రకటించారు. 

విద్యార్థుల‌తో స‌మావేశం అనంత‌రం మాట్లాడిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. వైద్య విద్యార్థుల‌తో భేటీ సానుకూలంగా జ‌రిగింద‌ని తెలిపారు. వారి డిమాండ్ల‌లో 99 శాతం అంగీక‌రించిన‌ట్లు చెప్పారు. విద్యార్థుల ఐదు డిమాండ్ల‌లో మూడింటిని అంగీక‌రించిన‌ట్లు పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యశాఖ కార్య‌ద‌ర్శి ఎన్ఎస్ నిగ‌మ్‌ను తొల‌గించేందుకు సీఎం అంగీక‌రించ‌లేదు. 

హెల్త్ సెక్ర‌ట‌రీని తొల‌గిస్తే ఆరోగ్య రంగంలో ఒక్క‌సారిగా అనిశ్చితి నెల‌కొంటుంద‌ని, ఈ విష‌యం విద్యార్థుల‌తో చెప్పిన‌ట్లు ఆమె వివ‌రించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం కొత్త పోలీస్ క‌మిష‌న‌ర్‌ను నియ‌మిస్తామ‌ని వెల్ల‌డించారు. ఐదో డిమాండ్ అయిన వైద్య విద్యార్థిని హ‌త్యాచార విచార‌ణ అంశం త‌మ ప‌రిధిలో లేద‌ని, సీబీఐ విచార‌ణ జ‌రుపుతోంద‌ని, సుప్రీంకోర్టులో ఉంద‌ని చెప్పారు.
  
ఇక వైద్యుల డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం అంగీక‌రించినందున ఆందోళ‌న విర‌మించి వెంట‌నే విధుల్లో చేరాల‌ని సీఎం సూచించారు. వైద్య విద్యార్థుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోమ‌ని తెలిపారు. అలాగే ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక స‌దుపాయాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నేతృత్వంలో ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. 

ముఖ్య‌మంత్రితో భేటీ అనంత‌రం మాట్లాడిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఇది త‌మ నైతిక విజయంగా పేర్కొన్నారు. అయ‌తే, సీఎం ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News