Rampachodavaram: దారుణం.. రోజూ 100కు పైగా గుంజీలు.. న‌డ‌వ‌లేని స్థితిలో బాలిక‌లు!

Illness to 50 Students in Rampachodavaram of AP

  • అల్లూరి జిల్లా రంప‌చోడ‌వ‌రం ఏపీఆర్ బాలిక‌ల జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఘ‌ట‌న‌
  • క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో ప్రిన్సిప‌ల్ ప్ర‌సూన అమాన‌వీయ‌త‌
  • ఇంట‌ర్ విద్యార్థినుల‌తో 3 రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించిన వైనం

ఏపీలోని అల్లూరి జిల్లా రంప‌చోడ‌వ‌రంలోని ఏపీఆర్ బాలిక‌ల జూనియ‌ర్ క‌ళాశాల‌లో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో ప్రిన్సిప‌ల్ ప్ర‌సూన, పీడీ కృష్ణ‌కుమారి విద్యార్థినుల‌తో మూడు రోజుల పాటు 100 నుంచి 200 గుంజీలు తీయించారు. 

ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థినులు.. తాము చెప్పిన మాట విన‌డం లేద‌ని ప్రిన్సిప‌ల్‌, పీడీ శుక్ర‌వారం నుంచి వారితో ఇలా 100కు పైగా గుంజీలు తీయించారు. ఇలా మూడు రోజుల నుంచి జరుగుతోంది. 

సోమ‌వారం కూడా అలాగే చేయ‌డంతో దాంతో 50 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కొంద‌రు న‌డ‌వ‌లేని స్థితికి చేరుకున్నారు. త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అంద‌డంతో వారు కాలేజీకి చేరుకుని పిల్ల‌ల‌ను ఏరియా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

వారిలో సాయంత్రానికి కోలుకున్న కొంద‌రిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా, బాలిక‌ల‌ను చేతు‌ల‌పై మోసుకెళ్తున్న వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

ఘ‌ట‌న‌పై ఎమ్మెల్యే శిరీషాదేవి విచార‌ణ‌కు ఆదేశం
క్ర‌మ‌శిక్ష‌ణ పేరిట విద్యార్థినుల‌ చేత గుంజీలు తీయించ‌డం దారుణ‌మైన చ‌ర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఐటీడీఏ పీఓ క‌ట్టా సింహాచ‌లాన్ని ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుప‌త్రికి వెళ్లిన ఎమ్మెల్యే, బాలిక‌ల‌ను అడిగి వారి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నారు. 

'ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి నిధులూ రావ‌డం లేదు. నా సొంత డ‌బ్బుల‌తో మీ అంద‌రికీ భోజ‌నం పెడుతున్నాను' అని ప్రిన్సిప‌ల్ ప్ర‌సూన అంటున్నార‌ని విద్యార్థినులు ఎమ్మెల్యే ముందు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌న‌తో చెప్పాల‌ని బాలిక‌ల‌కు ఎమ్మెల్యే భ‌రోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News