Jani Master: జానీ మాస్టర్ ను పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించిన జనసేన హైకమాండ్

Janasena party ordered Jani Master keep restrain from party activities

  • టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న జానీ మాస్టర్
  • జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన డ్యాన్స్ అసిస్టెంట్
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఇటీవల ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన జానీ మాస్టర్
  • రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పదవి అప్పగించిన పవన్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ పై ఓ యువతి అత్యాచార ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. జానీ మాస్టర్... జనసేనాని పవన్ కల్యాణ్ కు, మెగా కుటుంబానికి సన్నిహితుడిగా పేరుపొందడంతో ఈ విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు జనసేన హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. 

జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనందున పార్టీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించారు. జనసేన పార్టీ వివాదాల నిర్వహణ విభాగం అధ్యక్షుడు వేములపాటి అజయ్ కుమార్ పేరిట ఈ ప్రకటన వెలువడింది. 

కాగా, జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి ఇవాళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

కాగా, తనకు జానీ మాస్టర్ 2017లో పరిచయం అయ్యాడని, రెండేళ్ల తర్వాత అతడి వద్ద డ్యాన్స్ అసిస్టెంట్ గా చేరానని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబయిలో ఓసారి తనను లైంగికంగా వేధించాడని, షూటింగ్ వాహనంలో కూడా వేధించాడని ఆమె వివరించారు. తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని, జానీ మాస్టర్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ఫిర్యాదు చేశారు. 

జానీ మాస్టర్ ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఆయన నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆయనకు జనసేన నాయకత్వం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ పదవి అప్పగించింది.

  • Loading...

More Telugu News