Arvind Kejriwal: రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా: అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Arvind Kejriwal Says He Will Resign As Delhi CM In Two Days

  • ఈ ఉదయం పార్టీ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన కేజ్రీవాల్
  • పార్టీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు
  • హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంపై పార్టీ నేతలతో చర్చ
  • ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతానని, తాను నిజాయతీపరుడినైతే ఓట్లు వేస్తారన్న కేజ్రీవాల్

మరో రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎంగా ఉండనని అన్నారు. అందుకే ప్రజాతీర్పు కోరతామని స్పష్టం చేశారు. నేను నిర్దోషినని నమ్మితే భారీగా ఓట్లు వేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. 

తనను జైలుకు పంపి, ఆప్ లో చీలికలు తీసుకురావాలని ప్రయత్నించారని, తద్వారా ఢిల్లీ పీఠం చేజిక్కించుకోవాలని భావించారని వివరించారు. ఎన్ని కుట్రలు పన్నినా ఆప్ ను విచ్ఛిన్నం చేయలేకపోయారని తెలిపారు. జైలు నుంచి కూడా ప్రభుత్వాన్ని నడపవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు నిరూపించాయని అన్నారు. 

రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లూ రాజీనామా చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మహారాష్ట్రతో పాటు ఢిల్లీకి కూడా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి దాదాపు ఆరు నెలల పాటు జైలులో ఉన్న ఆయన తాజాగా బెయిలుపై బయటకు వచ్చారు. ఈ ఉదయం ఆయన తొలిసారి పార్టీ కొత్త హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

అయితే, ఈ వ్యాఖ్యల పట్ల పార్టీలో అంతర్గతంగా చర్చ బయలుదేరడంతో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉండాలని పార్టీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అయితే, కేజ్రీవాల్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటంటే... నవంబరులో ఎన్నికలకు వెళ్లి సత్తా నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారని భరద్వాజ్ వివరించారు. ప్రజలు కేజ్రీవాల్ నిజాయతీపరుడు అని గుర్తిస్తే ఆప్ ఎన్నికల్లో గెలుస్తుందని, కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేశారు.

అంతకుముందు కేజ్రీవాల్ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడుగుతాను. నేను నిజాయతీపరుడిని అనుకుంటే ప్రజల నాకు ఓటేస్తారు. అప్పుడు నేను సీఎం సీటులో కూర్చుంటా. లేదంటే లేదు’’ అని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

మరో రెండ్రోజుల్లో సీఎం పదవికి తాను రాజీనామా చేస్తానని, తర్వాత పార్టీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తుందని, ఆ తర్వాత సీఎం పేరును నిర్ణయిస్తుందని కేజ్రీవాల్ వివరించారు.

  • Loading...

More Telugu News