Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామా

Iam Requesting Please Come And Talk Asks Mamata Banerjee To Doctors

  • ‘ప్లీజ్.. మాట్లాడుకుందాం రండి’.. జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ పిలుపు
  • నన్ను ఎందుకిలా అవమానిస్తున్నారు? అంటూ ప్రశ్న
  • చర్చల లైవ్ స్ట్రీమింగ్ కోసం పట్టుబట్టిన జూనియర్ డాక్టర్లు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద శనివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సీఎంతో చర్చల కోసం వచ్చిన జూనియర్ డాక్టర్లు దాదాపు రెండు గంటల పాటు బయటే వేచి ఉన్నారు. సీఎంతో తమ చర్చలు లైవ్ స్ట్రీమింగ్ జరగాలని వారు పట్టుబట్టారు. దీనికి అధికార యంత్రాంగం ఒప్పుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అంతకుముందు జూనియర్ డాక్టర్ల ప్రతినిధి బృందానికి సీఎం మమతా బెనర్జీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

‘ప్లీజ్.. లోపలికి రండి మాట్లాడుకుందాం. మీరు కోరితేనే కదా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. చర్చలు వద్దంటే కనీసం నాతో టీ తాగి వెళ్లండి. ఎందుకిలా నన్ను అవమానిస్తున్నారు?’ అంటూ మమత వాపోయారు. ఈ మీటింగ్ సందర్భంగా రాజకీయాల గురించి మర్చిపోదామని, మీటింగ్ లో చర్చించిన అంశాలపై ఓ నివేదిక తయారు చేసి దానిపై తాను సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకానీ మీటింగ్ లైవ్ స్ట్రీమింగ్ కుదరదని, సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప లైవ్ స్ట్రీమింగ్ చేయలేమని వివరించారు.

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ లో ఓ ట్రెయినీ డాక్టర్ హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. కోల్ కతాలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఆర్జీ కర్ ఆసుపత్రి ముందు అభయ (హత్యాచారానికి గురైన డాక్టర్ కు జూనియర్ డాక్టర్లు పెట్టిన పేరు) క్లినిక్ పేరుతో రోడ్డుపైనే రోగులకు సేవలందిస్తున్నారు. 

ఓవైపు నిరసన చేస్తూనే రోగులను పరీక్షించి మందులు రాసిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేస్తున్న డాక్టర్ల వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడి తర్వాత చర్చలకు ఆహ్వానించారు. దీంతో సాయంత్రం జూనియర్ డాక్టర్ల ప్రతినిధి బృందం సీఎం మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. అయితే, సీఎంతో తమ చర్చలు లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంతో చర్చలు జరగలేదు.

  • Loading...

More Telugu News