KTR: ఆ అధికారులను సస్పెండ్ చేస్తారో, తొలగిస్తారో... దమ్ముంటే రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకోవాలి: కేటీఆర్
- ఆదర్శ్ నగర్‌లో 75 ఇళ్లను కూల్చేశారని మండిపాటు
- పేద ప్రజల కడుపు కొట్టడానికి ముఖ్యమంత్రి అయ్యావా? అని నిలదీత
- రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డల కడుపు కొడుతున్నారని ఆగ్రహం
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాను చిత్తు కాగితంలా చూసి... విలువ ఇవ్వని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేస్తారో... తొలగిస్తారో... కానీ దమ్ముంటే ముఖ్యమంత్రి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్‌లో కొన్ని రోజుల క్రితం పేదలు, దివ్యాంగులకు చెందిన 75 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై మహబూబ్ నగర్‌లో కేటీఆర్ మాట్లాడుతూ... పేద ప్రజల కడుపు కొట్టడానికి సీఎం అయ్యావా? అని ధ్వజమెత్తారు.
ఆ ఇండ్లు పేదవాళ్లవి, దివ్యాంగులవి అనే సోయి లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పదిహేను రోజుల క్రితం ఇళ్లను కూల్చారని విమర్శించారు. దివ్యాంగులనే ఇంగితజ్ఞానం లేకుండా వారి నివాసాల పైకి బుల్డోజర్లను పంపించి కూల్చేశారన్నారు. పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతో సీఎంను అయ్యానని చెబుతున్న రేవంత్ రెడ్డి అదే పాలమూరు బిడ్డల కడుపు కొడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకుంటే కేసీఆర్ 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేశారని, పేదవాళ్లకు లక్షల పట్టాలు అందించామన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పేదల ఇళ్లను కూల్చేసిందన్నారు. రేవంత్ రెడ్డికి సంస్కారం ఉంటే... పేదల పట్ల ప్రేమ ఉంటే... వెంటనే 75 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.