YS Jagan: ప్రభుత్వం మారినా అధికారులు మారలేదు.. రైతు అడంగల్ కాపీపై జగన్ ఫొటో, నవరత్నాల లోగో!

Jagan photo and logo on Adangal in Andhra Pradesh

  • మూడు నెలలైనా ధ్రువీకరణ పత్రాల్లో ఇంకా జగన్ ఫొటోనే
  • తాజాగా జగన్ ఫొటో, నవరత్నాల లోగోతో ఉన్న అండగల్ కాపీ జారీ
  • ప్రభుత్వం ఆదేశించినా ఇంకా పాత గుర్తులతోనే జారీ చేస్తున్న అధికారులు

ఏపీలో ప్రభుత్వం మారినా అధికారుల తీరుమారినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఇంకా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోనే దర్శనమిస్తోంది. తాజాగా ప్రజలకు జారీచేస్తున్న ధ్రువీకరణ పత్రాల్లోనూ జగన్ ఫొటో, ఆయన పథకాల పేర్లే కనిపిస్తున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని దుబ్బాకపల్లి గ్రామానికి చెందిన రైతు అడంగల్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ దానిని జారీ చేశారు. 12న ఇచ్చిన ఈ సర్టిఫైడ్ కాపీపై పైన కుడిభాగంలో జగన్ ఫొటో, ఆయన పథకంలో ఒకటైన నవరత్నాల లోగో ఉంది. దానిపై తహసీల్దార్ పేరు, సంతకం ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పాస్‌ పుస్తకాలు, ప్రభుత్వ రికార్డులు, ధ్రువీకరణ పత్రాలపై జగన్ ఫొటో, లోగోలు తొలగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వాటన్నింటిపై జగన్ ఫొటోను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇప్పటికే జారీ చేసిన వాటిని కూడా వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికి మూడు నెలలు గడిచినా వార్డు సచివాలయాల ద్వారా ఇచ్చే రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలు, సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News