Revanth Reddy: షరతులు లేకుండా వరద సాయం విడుదల చేయండి... కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Funds should be released without any conditions CM Revanth Reddy appeals central government

  • ఇటీవల భారీ వర్షాలు, వరదలతో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందన్న ముఖ్యమంత్రి
  • ఖమ్మం పట్టణానికి మున్నేరు వాగు ముప్పు నివారణకు రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న సీఎం
  • కేంద్ర అధికారుల బృందానికి విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి మరో విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని ఆయన అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఇవాళ (శుక్రవారం) వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర అధికారుల బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను తెలంగాణ సీఎంవో ప్రకటించింది.

అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లలో ఒక్క రూపాయిని కూడా... కఠిన నిబంధనల వల్ల రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని, నిబంధనలు సడలించాలని కేంద్ర అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ కోరారు. ఖమ్మం పట్టణానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని, రాష్ట్రం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.

రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని, ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు.

వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని అన్నారు.

మరోవైపు మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన ఘటన అరుదైనది కావడంతో కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించాలని, శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ కోరారు. 

కేంద్ర బృందంతో జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహదారు వేం నరేంద్ర రెడ్డి, సీఎస్ శాంతికుమారి, తదితర అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News