Yuvraj Singh: ధోనీ, కోహ్లీ, రోహిత్‌లలో ఎవరి బ్యాటింగ్ కోరుకుంటారు?.. యువరాజ్ సమాధానం ఇదే
- రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు ఓటేసిన మాజీ దిగ్గజం
- హిట్‌మ్యాన్ బ్యాటింగ్ శైలి తన మాదిరిగానే ఉంటుందన్న యూవీ
- ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అభిమానులే కాదు... కొందరు క్రికెటర్లు కూడా తమకు ఇష్టమైన ఆటగాడి బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటుంటారు. మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ తాను జీవితాంతం భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను చూడాలని కోరుకుంటానని చెప్పాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... వీరి ముగ్గురిలో ఎవరి బ్యాటింగ్‌ను జీవితాంతం చూడాలని కోరుకుంటారు?... అని ప్రశ్నించగా యూవీ ఈ సమాధానం ఇచ్చాడు.
‘స్పోర్ట్స్‌కీడా’ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ‘దిస్ ఆర్ దట్’ సెషన్లో ఈ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. రోహిత్ బ్యాటింగ్ శైలి తన బ్యాటింగ్‌ను పోలి ఉంటుందని యువీ అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ శైలి తనకు తెలియదని, బహుశా పెద్ద హిట్టర్ నేమో అని పేర్కొన్న యూవీ... తన బ్యాటింగ్ స్టయిల్ బహుశా రోహిత్ శర్మ బ్యాటింగ్ లాగా ఉంటుందని భావిస్తున్నానని వివరించాడు.
ఇటీవల రోహిత్ శర్మ క్రేజ్ మరింత పెరిగింది. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ఐసీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించడం ఇందుకు కారణమైంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు అతడు నాయకత్వం వహించాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ అద్భుతంగా ఆడాడు. 8 మ్యాచ్‌లు ఆడి 36.71 సగటుతో 251 పరుగులు చేశాడు. అంతేకాదు 2023 వన్డే వరల్డ్ కప్‌లో కూడా అతడు జట్టుని ఫైనల్‌కు తీసుకెళ్లగలిగాడు.
మరోవైపు బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా శుక్రవారం నాడు చెన్నై చేరుకుంది. స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఎయిర్‌పోర్ట్‌లో టీమ్ బస్సులో కనిపించారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా శుక్రవారం తెల్లవారుజామున చెన్నై చేరుకున్నారు. కోహ్లీ లండన్ నుంచి నేరుగా వచ్చాడు. కాగా సెప్టెంబరు 19న మొదలు కానున్న ఈ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సన్నాహాలు మొదలుపెట్టింది.