Port Blair: పోర్ట్ బ్లెయిర్ నగరం పేరు మార్చిన కేంద్రం... ఇక నుంచి శ్రీవిజయపురం

 Centre changed name of Port Blair as Sri Vijaya Puram

  • అండమాన్ నికోబార్ దీవుల రాజధానిగా ఉన్న పోర్టు బ్లెయిర్
  • పేరు మార్చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించిన అమిత్ షా
  • పోర్టు బ్లెయిర్ అనే పేరు వలసవాద పోకడలను సూచిస్తోందని వెల్లడి
  • కొత్త పేరు స్వాతంత్ర్య సమర విజయానికి ప్రతీక అని వివరణ

కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరు మారింది. ఇక నుంచి పోర్టు బ్లెయిర్ ను శ్రీవిజయపురం అని పిలవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ప్రకటనలో తెలిపారు. 

పోర్టు బ్లెయిర్ అనే పేరు వలసవాద పోకడలను సూచిస్తోందని, శ్రీవిజయపురం అనే పేరు మన స్వాతంత్ర్య సమర విజయాన్ని, అండమాన్ నికోబార్ దీవుల ప్రత్యేక పాత్రకు ప్రతిబింబంలా నిలుస్తుందని వివరించారు. అండమాన్ నికోబార్ దీవులకు దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, చరిత్రలోనూ అసమానమైన స్థానం ఉందని అమిత్ షా కీర్తించారు. 

ఈ దీవుల ప్రాంతం ఒకప్పుడు చోళులకు నౌకా స్థావరంగా ఉందని వెల్లడించారు. ఇవాళ భారత్ కు వ్యూహాత్మకంగా కీలక స్థావరంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది కూడా ఇక్కడేనని వెల్లడించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరసావర్కర్, ఇతర సమర యోధులను నిర్బంధించింది ఇక్కడి సెల్యులర్ జైలులోనే అని అమిత్ షా వివరించారు.

  • Loading...

More Telugu News