Ishan Kishan: అనంతపురంలో ఇషాన్ కిషన్... దులీప్ ట్రోఫీలో సర్‌ప్రైజ్ ఎంట్రీ
- ఇండియా-సీ తరపున ఆడిన యంగ్ క్రికెటర్
- ఇండియా-బీపై అర్ధ సెంచరీ కూడా సాధించిన స్టార్ ప్లేయర్
- హర్షం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
అందుబాటులో ఉండి కూడా గత రంజీ సీజన్‌లో ఆడకపోవడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురైన యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్‌లో ఆశ్చర్యపరిచాడు. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా మొదలైన ఇండియా-బీ వర్సెస్ ఇండియా-సీ మ్యాచ్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-సీ తరపున బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ కూడా సాధించాడు.
బుచ్చి బాబు టోర్నమెంట్‌లో జార్ఖండ్‌కు ఆడుతున్న సమయంలో ఇషాన్ కిషన్ టోర్నీకి దూరమయ్యాడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్‌లో కూడా ఆడలేదు. అయితే బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు భారత జట్టును ప్రకటించిన తర్వాత దులీప్ ట్రోఫీ ఆడుతున్న జట్లలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
దులీప్ ట్రోఫీ ఆడనున్న జట్లను బీసీసీఐ ప్రకటించినప్పటికీ ఆ ప్రకటనలో ఎక్కడా ఇషాన్ కిషన్ పేరు కనిపించలేదు. సీ జట్టులో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. అయితే బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లు ఎంపికవ్వడంతో దులీప్ ట్రోఫీలో వీరి పేర్లను తొలగించింది. తదనుగుణంగా జట్లను అప్‌డేట్ చేసింది. దీంతో ఇషాన్ కిషన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు.
నిజానికి దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్‌లో ఇషాన్ కిషన్ ఇండియా-డీ టీమ్‌కు ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా దూరమవ్వడంతో అతడి స్థానంలో సంజు శాంసన్‌ని ఎంపిక చేశారు. కాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అర్ధ సెంచరీ కూడా సాధించడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలోకి ‘కమ్ బ్యాక్’ చేసేందుకు అడుగు పడిందని వ్యాఖ్యానిస్తున్నారు.