Sajjanar: ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్... జాగ్ర‌త్త‌!: టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Sajjanar alerts on kidnaps

  • అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని వెల్లడి
  • అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటున్నారని పేర్కొన్న సజ్జనార్
  • ఇలాంటి బెదిరింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన

ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వచ్చే వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సజ్జనార్ హెచ్చరించారు. స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారని, అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే ఆడ‌పిల్ల‌ల‌ను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

తాజాగా, హైదరాబాద్‌లోని రాయ‌దుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబ‌ర్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్ చేశారని వెల్లడించారు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బును పంపించకుంటే చంపేస్తామని సైబర్ నేరగాళ్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారని సజ్జనార్ పేర్కొన్నారు. మీ అమ్మాయి ఏడుస్తోందంటూ ఓ వాయిస్‌ని కూడా పంపించినట్లు తెలిపారు.

ఏడుస్తున్న గొంతు వినిపించ‌డంతో కాలేజీకి వెళ్లిన త‌మ‌ కూతురు కిడ్నాప్‌న‌కు గురైంద‌ని త‌ల్లిదండ్రులు భావించి... డ‌బ్బులు పంపించేందుకు సిద్ధపడినట్లు చెప్పారు. అయితే మోస‌గాళ్ల‌తో ఫోన్‌లో మాట్లాడుతూనే త‌మ బంధువుల‌కు ఈ విష‌యాన్ని చెప్పారని పేర్కొన్నారు. తమ కూతురు కాలేజీలో ఉందో లేదో తెలుసుకోవాలని వారిని కోరారని తెలిపారు. తమ కూతురు కాలేజీలో క్షేమంగా ఉందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారని వెల్లడించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ త‌ర‌హా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌గా వస్తున్నాయని, ఆడపిల్ల‌లను కిడ్నాప్ చేశార‌ని చెప్ప‌గానే న‌మ్మి వారికి డ‌బ్బులు పంపిస్తున్నారని పేర్కొన్నారు. అజ్ఞాత వ్య‌క్తుల నుంచి... విదేశీ ఫోన్ నంబ‌ర్ల‌తో వ‌చ్చే వాట్సాప్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. బెదిరింపుల‌కు జంక‌కుండా స్థానిక పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News