wolf: యూపీలో తోడేళ్ల అసాధారణ దాడులు... కారణం ఇదేనా...?

rabies or distemper virus may be behind bahraich wolf attacks says intl big cat alliance chief

  • ఉత్తరప్రదేశ్ బహరయిచ్ జిల్లాలో కలకలాన్ని రేపుతున్న తోడేళ్ల దాడులు 
  • 50 గ్రామాలకు చెందిన ప్రజల్లో భయాందోళనలు 
  • 'ఆపరేషన్ భేటీయా' కార్యక్రమంలో గుంపులోని ఐదు తోడేళ్లను బంధించిన అటవీ శాఖ అధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని బహరయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఇటీవల తోడేళ్ల దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో 50 గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తోడేళ్లను బంధించేందుకు అటవీ శాఖ ‘ఆపరేషన్ భేటియా’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇందుకు గానూ 165 మంది సిబ్బందిని, 18 మంది షూటర్‌‌లను మోహరించింది. వాటి ఆచూకీ కోసం థర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్‌లను అటవీశాఖ వినియోగిస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకూ ఐదు తోడేళ్లను బంధించారు.

అయితే, తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటంపై ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) చీఫ్ ఎస్పీ యాదవ్ తన అభిప్రాయాలను పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బహుశా రేబిస్ బారినపడటం లేదా వాటికి కెనైట్ డిస్టెంపర్ వైరస్ సోకడం కారణం అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తోడేళ్ల వరుస దాడులు అసాధారణమైన విషయమని అన్నారు. గత పదేళ్లలో ఈ తరహా ఘటన ఇదే మొదటిది కావచ్చని పేర్కొన్నారు. ఆ జంతువుల్లో దేనికయినా రేబిస్ సోకి ఉండవచ్చన్న అభిప్రాయంతో దాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోందన్నారు. అయితే.. జంతువుల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే కచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చని అన్నారు. రేబిస్, కెనైట్ డిస్టెంపర్ వైరస్‌లు కొన్ని సార్లు పులుల వంటి వాటి ప్రవర్తనను మార్చగలవని, తద్వారా అవి మనుషులంటే భయాన్ని కోల్పోతాయని, తోడేళ్ల దాడులకు ఇది కారణమై ఉండవచ్చని ఎస్పీ యాదవ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News