Rahul Gandhi: సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తున్నారా అన్న రాహుల్ పై కేంద్ర మంత్రి ఫైర్

Hardeep Singh Puri fires on Rahul Gandhi

  • వర్జీనియాలో కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
  • సిక్కులకు రక్షణ లేదన్న రాహుల్
  • రాహుల్ విదేశీ పర్యటనల్లో ప్రమాదకర వ్యాఖ్యలు చేస్తున్నారన్న హర్దీప్ సింగ్

సిక్కుల పరిరక్షణకు మోదీ ప్రభుత్వం ఎంతో చేస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. విదేశీ పర్యటనల్లో రాహుల్ గాంధీ ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.  

తలపాగా (టర్బన్) ధరించాలంటేనే భారత్ లోని సిక్కులు భయపడుతున్నారని రాహుల్ అంటున్నారని... తాను 60 ఏళ్లుగా టర్బన్ ధరిస్తున్నానని హర్దీప్ సింగ్ అన్నారు. సిక్కుల సంరక్షణకు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రక్షణ చర్యలను చేపడుతోందని చెప్పారు. 

మనకు స్వాతంత్ర్యం వచ్చిన 1947 తర్వాత మన దేశంలో ఇప్పుడున్నంత సురక్షితంగా సిక్కులు మరెప్పుడూ లేరని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సిక్కులు భయాందోళనలతో బతికారని చెప్పారు. 1984లో సిక్కులను ఊచకోత కోశారని, 3 వేల మందిని చంపేశారని హర్దీప్ సింగ్ అన్నారు. ఇళ్లల్లో ఉన్న సిక్కులను బయటకు లాక్కొచ్చి వారిని సజీవ దహనం చేశారని చెప్పారు. 

ఈ ఉదయం వర్జీనియాలో రాహుల్ మాట్లాడుతూ.. ఇండియాలో సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు. సిక్కులు గురుద్వారాలకు వెళ్లగలుగుతున్నారా? అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News