Manu Bhaker: ఒలింపిక్స్ వేదికపై నీరజ్ తో ఏంమాట్లాడానంటే.. ! క్లారిటీ ఇచ్చిన మను భాకర్

Manu Bhaker Interview

  • తొలి పతకం సాధించిన క్షణం తనకు ఎంతో సంతోషకరమైందన్న మను భాకర్  
  • దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని వ్యాఖ్య 
  • షూటర్ కాకుంటే టీచర్ అయ్యేదానినని వివరణ 

పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని భారత స్టార్ షూటర్ మను భాకర్ వెల్లడించారు. ఒలింపిక్స్ లో మను భాకర్ దేశానికి రెండు పతకాలు సాధించిపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మను భాకర్ మాట్లాడుతూ... ఒలింపిక్స్ వేదికపై సహచర అథ్లెట్ నీరజ్ చోప్రాతో తన ఇంటరాక్షన్ గురించి వివరణ ఇచ్చారు. ఆ రోజు నీరజ్ తో మాట్లాడిన సందర్భం తనకు ప్రత్యేకమని చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ వేదికపై పోటీ సందర్భంగా ఆటగాళ్లపై నెలకొనే ఒత్తిడి గురించి తాము మాట్లాడుకున్నామని వివరించారు. అథ్లెట్లుగా మేము ఒకే తరహా అనుభవాలను, సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అర్థమైందని చెప్పారు. నీరజ్ జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి, చాలామందికి స్పూర్తి అన్నారు. అతడితో జరిగిన సంభాషణ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు. 

షూటింగ్ లో తొలి పతకం సాధించిన క్షణం చాలా సంతోషించానని, ఆ సమయంలో తనను ఎన్నో భావోద్వేగాలు చుట్టుముట్టాయని మను భాకర్ వివరించారు. తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం వల్లే పతకం సాధించానని, తన జీవితంలో అదెంతో సంతోషకరమైన సందర్భమని తెలిపారు. ఇక, తన దినచర్య గురించి చెబుతూ... యోగాతో డైలీ రొటీన్ మొదలవుతుందన్నారు.

రోజువారీ శిక్షణ, రికవరీ, వ్యక్తిగత జీవితానికి, స్పోర్ట్స్ కు తగిన బ్యాలెన్స్ చేసుకోవడం వంటి విషయాలపై ఫోకస్ చేస్తుంటానని వివరించారు. షూటర్ కాకుంటే టీచర్ గా సెటిల్ అయ్యేదానిని అని, పిజ్జా తినడం ఇష్టమని మను చెప్పారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు.

Manu Bhaker
Paris Olympics
Double medalist
Neeraj Chopra
Sports News

More Telugu News