Deepthi Jeevanji: నా వైకల్యాన్ని అంతా హేళన చేసేవారు.. అథ్లెట్ జీవాంజి దీప్తి

Deepthi Jeevanji On Tough Road To Paris Paralympics 2024 Medal

  • బాల్యంలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించిన పారాలింపిక్స్ మెడల్ విజేత
  • గ్రహణం, మొర్రితో జన్మించిన దీప్తి
  • వదిలించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చెప్పారన్న దీప్తి తల్లి

ఎదుగుదల లోపంతో పుట్టిన తాను బాల్యంలో చేదు అనుభవాలు ఎన్నో ఎదుర్కొన్నానని పారాలింపిక్స్ కాంస్య పతకం విజేత జీవాంజి దీప్తి వెల్లడించారు. చుట్టుపక్కల వాళ్లు, కొంతమంది బంధువులు కూడా తనను కోతి అని, పిచ్చిది అని హేళన చేసేవారని చెప్పారు. గ్రహణం మొర్రితో పుట్టిన తనను అనాథ ఆశ్రమంలో వదిలిరమ్మని తన తల్లిదండ్రులకు సూచించారని తెలిపారు. గ్రామస్తుల హేళనలను పట్టించుకోకుండా తన పరుగుపైనే దృష్టి పెట్టేదానిని అంటూ దీప్తి వివరించారు.

ఈ విషయంలో తన తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో తాతయ్య తమకిచ్చిన భూమిని అమ్మేయాల్సి వచ్చిందని, అయితే, ఆసియా గేమ్స్ లో పతకం సాధించాక ఆ భూమిని తిరిగి కొనుక్కున్నామని వివరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్తి ఈ వివరాలు వెల్లడించారు.

దీప్తి తల్లి జీవాంజి ధనలక్ష్మి మాట్లాడుతూ.. దీప్తి మిగతా పిల్లల మాదిరిగా పుట్టలేదని, గ్రహణం మొర్రి కారణంగా ముఖం చిన్నగా, పెదవులు అసహజంగా ఉండేవని చెప్పారు. తన బిడ్డను చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఆ పసిగుడ్డును ఏదోలా వదిలించుకొమ్మని చెప్పారని గుర్తుచేసుకున్నారు. అయితే, తనకు మాత్రం దీప్తి ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని చెప్పారు. పారిస్ పారాలింపిక్స్ లో పతకం సాధించి తాను స్పెషల్ గర్ల్ నని దీప్తి ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు.

  • Loading...

More Telugu News