Muttiah Muralitharan: నా రికార్డు ఎప్ప‌టికీ ప‌దిల‌మే.. ఇప్ప‌టి బౌల‌ర్ల‌కు అది అసాధ్యం: ముత్తయ్య మురళీధరన్

Muttiah Muralitharan Says No One Will Break His Test Wickets Record

  • టెస్టు క్రికెట్ భవిష్యత్‌పై శ్రీలంక బౌలింగ్ దిగ్గ‌జం ఆందోళన 
  • పొట్టి ఫార్మాట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టెస్టు క్రికెట్ మ‌స‌క‌బారుతోందని ఆవేద‌న 
  • ఆట‌గాళ్లలో కూడా టెస్టు మ్యాచులపై ఆస‌క్తి త‌గ్గుతోందన్న ముర‌ళీధ‌ర‌న్‌
  • త‌న పేరిట ఉన్న అత్యధిక టెస్టు వికెట్ల (800) రికార్డును బ్రేక్ చేయ‌లేరంటూ వ్యాఖ్య‌

శ్రీలంక బౌలింగ్ దిగ్గ‌జం ముత్తయ్య మురళీధరన్ తాజాగా టెస్టు క్రికెట్ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. పొట్టి ఫార్మాట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టెస్టు క్రికెట్ మ‌స‌క‌బారుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆట‌గాళ్లు కూడా టెస్టు మ్యాచుల ప‌ట్ల ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని, అటు ప్రేక్ష‌కుల్లో కూడా ఈ ఫార్మాట్‌పై ఆస‌క్తి త‌గ్గుతోందని చెప్పుకొచ్చాడు.  

ఇక త‌న పేరిట ఉన్న అత్యధిక టెస్టు వికెట్ల (800) రికార్డును కూడా ఎవ‌రూ బ‌ద్ద‌లు కొట్ట‌లేర‌ని, ఈ రికార్డు టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా మిగిలిపోతుంద‌ని జోస్యం చెప్పాడు. తన రికార్డును ఎప్పుడైనా ఏ బౌలర్ అయినా బ్రేక్ చేయ‌గలడని తాను భావించడం లేదని ఈ దిగ్గ‌జ ఆఫ్ స్పిన్నర్ పేర్కొన్నాడు. 

దానికి ప్ర‌ధాన‌ కార‌ణం ప్రస్తుత రోజుల్లో క్రికెటర్లు పొట్టి ఫార్మాట్‌లపైనే ఎక్కువ‌గా దృష్టి సారించ‌డం అని చెప్పాడు. అందుకే త‌న రికార్డుకు దగ్గరలో కూడా ఇప్ప‌టి బౌల‌ర్లు ఎవ‌రూ రాలేరంటూ మురళీధరన్ చెప్పుకొచ్చాడు. అటు టెస్టు మ్యాచుల‌కు చాలా దేశాల్లో వీక్షకుల సంఖ్య తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆంగ్ల వార్తాపత్రిక డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ మురళీధరన్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. 

"ప్రతి దేశం ప్ర‌స్తుతం ఏడాదికి బహుశా ఆరు లేదా ఏడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతోంది. వీటిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ రూపంలో కొన్ని ఎక్కువ టెస్టులు ఆడుతున్నాయి. కానీ, చాలా దేశాల్లో చాలా మంది ప్రజలు ఈ మ్యాచ్‌ల‌ను చూడరు. దాంతో టెస్ట్ క్రికెట్ త‌గ్గుతోంది" అన్నారాయన.

ఇక మురళీధరన్ తన రికార్డును చాలా కాలం పాటు ఎవ‌రూ అధిగమించకపోవడానికి ఒక ప్రాథమిక కారణాన్ని చెప్పాడు.

"ఇది చాలా కష్టం (ఎవరైనా 800 టెస్ట్ వికెట్లు అధిగమించడం). ఎందుకంటే షార్ట్-ఫార్మ్ క్రికెట్‌కు ప్రాధాన్యత పెరిగింది. అలాగే మేము 20 సంవత్సరాలు ఆడాము. ఇప్పుడు క్రికెట్‌ కెరీర్లు చాలా తక్కువ టైమ్‌తో ఉంటున్నాయి. ఇక ఆట‌గాళ్ల‌కు స్థిరత్వమే పెద్ద‌ సమస్య. ఎంత మంచి ఆట‌గాడైనా ఏదో ఒక స‌మ‌యంలో ఫామ్ కోల్పోవ‌డం జ‌రుగుతుంది. ప్ర‌స్తుత క్రికెట‌ర్లు తిరిగి ల‌య‌ను అందుకుని జ‌ట్టులోకి రావ‌డం క‌ష్టంగా మారుతోంది. అప్ప‌టికే ఎంతో టాలెంటెడ్ క్రికెట్లు జట్టులోకి వ‌చ్చేస్తుంటారు. అనుభవజ్ఞులుగా మారితేనే మంచి క్రికెట్ సాధ్యం అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఇది చాలా కష్టం. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ క్రికెట‌ర్ల‌ నెత్తిమీద చాలా టోర్నమెంట్లు, ఇత‌ర‌ విషయాలు ఉంటున్నాయి" అని చెప్పుకొచ్చాడు.

కాగా, మురళీధరన్ రికార్డుకు వ‌ర్త‌మాన క్రికెట‌ర్ల‌లో దగ్గరగా ఉన్న బౌలర్లు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ (530 వికెట్లు). ఆ త‌ర్వాత‌ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (516). అయితే, లియోన్ వ‌య‌సు 36, అశ్విన్ వ‌య‌సు 37. క‌నుక వీర‌ద్ద‌రూ రిటైరయ్యేలోపు మురళీధరన్ రికార్డును అందుకునే అవకాశమే లేదు. ఇక ఇంగ్లండ్‌ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఇటీవల 704 వికెట్లతో రిటైర్ అయ్యాడు. ఇది టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఆల్ టైమ్ మూడో అత్యధిక వికెట్ల రికార్డు కావ‌డం గ‌మ‌నార్హం.

  • Loading...

More Telugu News