Vijayawada: వరద బాధితుడిపై చేయి చేసుకున్న వీఆర్ఓ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

krishna vro vijayalakshmi attack on flood victim

  • విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో వీఆర్ఓ తీరుపై బాధితుల ఆగ్రహం
  • వీఆర్ఓకు షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్ సృజన
  • బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించినా, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినా ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరిక  

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఉద్యోగులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా, దురుసుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. వరద బాధితుడి పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్న ఓ వీఆర్ఓపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

విషయంలోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ 58వ డివిజన్ షాదీఖానా వద్ద సోమవారం వరద బాధితులకు పోలీసుల సమక్షంలో ఎండీయూ వాహనం ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిత్యావసర వస్తువుల పంపిణీ పర్యవేక్షిస్తున్న వీఆర్ఓ విజయలక్ష్మి పని తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పటి నుండి తమ వీధిలో ఆహారం, మంచినీరు అందలేదని విఆర్ఓను ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో సహనం కోల్పోయిన వీఆర్ఓ .. వరద బాధితులను దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఎండీ యాసిన్ అనే యువకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను దూరంగా పంపించి వేశారు. 

వరద బాధితులు పలువురు ఆమెను నిలదీయడాన్ని వీడియో తీసి జరిగిన ఘటనపై వీఆర్ఓ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో వరద బాధితుడిపై వీఆర్ఓ చేయి చేసుకున్న ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, సదరు వీఆర్ఓ తీరుపై బాధితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందిస్తూ.. వీఆర్ఓ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జరిగిన ఘటనకు రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వరద బాధితుల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినా, బాధ్యతా రాహితంగా వ్యవహరించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News