Chandrababu: జగన్ విజయవాడకు వచ్చి బురదలో తిరిగితే పాపాలు కొంతైనా పోయేవి: చంద్రబాబు

Chandrababu fires at ys jagan for blaming government over floods

  • ప్రజల కష్టాలను, ఇబ్బందులను తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న చంద్రబాబు
  • తనతో పాటు మంత్రులు, అధికారులు బురదలో తిరుగుతున్నారని వ్యాఖ్య
  • బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారన్న చంద్రబాబు

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విజయవాడ వచ్చి బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవని, కానీ బెంగళూరులో కూర్చోని తమపై బురద జల్లుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారీ వరదల నేపథ్యంలో ప్రజల కష్టాలను, ఇబ్బందులను తీర్చడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు కూడా వరదల్లో, బురదలో తిరుగుతున్నారన్నారు.

వరదలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు పడుతున్న బాధలు చెప్పలేనివని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరుకు గండ్లు పడితే గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. పైగా బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. ఇది పెద్ద సవాల్ అని, దీనిని అధిగమించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారికి ఆదాయం వచ్చే మార్గాలను చూపిస్తామన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి వెళ్లిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు చెప్పారు. లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ గద్దె దిగిపోయారని, ఇప్పుడు కనీసం ఇక్కడకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నా ఆయన పాపాలు కొంత పోయేవన్నారు. 

ఆ చిన్నారులకు చంద్రబాబు ప్రశంస

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం, పడమర విప్పర్రు గ్రామంలో శ్రీవిద్యానికేతన్ స్కూల్‌కు చెందిన చిన్నారులు వరద బాధితుల కోసం తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

"చిన్నారులు అసాధారణ కరుణను ప్రదర్శించారు. మొత్తం రూ.31 వేలను సేకరించి అందించడం నిజంగా చాలా గ్రేట్. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. అవసరం ఉన్న వారి పట్ల శ్రద్ధ వహించడం, సాయం చేయడాన్ని వారికి బోధించడం చాలా గొప్ప విషయం. ఈ విలువలను విద్యార్థులు పాటించేలా చూసిన పాఠశాల యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలో మంచి భవిష్యత్తుకు ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయి" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News