Pawan Kalyan: వరద బాధితులకు దినసరి కూలీ రూ. 600 విరాళం.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
![Pawan Kalyan Praises Man Who Sent Rs 600 to AP CM Relief Fund](https://imgd.ap7am.com/thumbnail/cr-20240909tn66dea5e1ddb43.jpg)
- ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు గుడపర్తి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రూ.600 విరాళం
- ఈ విషయాన్ని అతడు ఎక్స్ వేదికగా వెల్లడించడంతో స్పందించిన జనసేనాని
- మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సాయం చేయడం స్ఫూర్తిదాయకమంటూ పవన్ కితాబు
- ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనదే అన్న జనసేనాని
ఏపీలో భారీ వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు తమవంతు సాయం చేస్తూ వరద బాధితులను ఆదుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఓ దినసరి కూలీ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించడం విశేషం. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ బతికే గుడపర్తి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రూ. 600 సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చాడు. ఈ విషయాన్ని అతడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించాడు.
"ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 విజయవాడ వరద బాధితులకు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. నాకు స్ఫూర్తి పవన్ కల్యాణ్ గారు. కష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది" అని గుడపర్తి సుబ్రహ్మణ్యం ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సుబ్రహ్మణ్యంను అభినందిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు. రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సాయం చేయాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం అంటూ జనసేనాని ప్రశంసించారు.
"రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనదే. అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ. నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి గుడపర్తి సుబ్రహ్మణ్యం అందించిన రూ. 600 చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.