Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నేటితో ఏడాది.. అప్పుడేం జరిగింది?

Chandrababu arrested one year ago at the same day

  • ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున చంద్రబాబు అరెస్ట్
  • బస్సులో నిద్రపోతున్న టీడీపీ అధినేతను నిద్రలేపి బలవంతంగా విజయవాడ తరలింపు
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పినా ఆధారాలు చూపించలేకపోయిన పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
  • బాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండించిన ఏపీ ప్రజలు
  • 53 రోజుల అనంతరం చంద్రబాబు విడుదల

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయి నేటికి సరిగ్గా ఏడాది. ప్రతిపక్ష నేతగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం వద్దకు చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులో బస చేసిన చంద్రబాబు నిద్రపోతుండగా ఉదయం ఆరు గంటలకే అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సు నుంచి చంద్రబాబును బయటకు పిలిచి అరెస్ట్ చేశారు.

చంద్రబాబు నిలదీత.. నీళ్లు నమిలిన పోలీసులు
ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారన్న ఆయన తరపు న్యాయవాదులకు పోలీసులు విచిత్రమైన సమాధానం చెప్పారు. కోర్టులో రిమాండ్ రిపోర్టు సమర్పించే సమయంలో అన్ని వివరాలు ఇస్తామని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది. మరోవైపు, చంద్రబాబు కూడా పోలీసులను ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చూపించాలని నిలదీశారు. దీంతో పోలీసులు నీళ్లు నమిలారు. విజయవాడ వెళ్లే లోపు ఇస్తామని అప్పటి డీఐజీ రఘురామిరెడ్డి చంద్రబాబు తరపు న్యాయవాదులకు చెప్పారు.

14 రోజుల రిమాండ్
మరోవైపు, పోలీసులపై తనకు నమ్మకం లేదని, ఎన్ఎస్‌జీ పర్యవేక్షణలోనే వస్తానని చంద్రబాబు భీష్మించుకోవడంతో అందుకు పోలీసులు అంగీకరించడంతో విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో వైద్య పరీక్షల అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తమ వివాహ వార్షికోత్సవం రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
53 రోజులు జైలులోనే
నిజానికి చంద్రబాబు రెండుమూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. అయితే, 53 రోజుల వరకు ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. అధినేత జైలులో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని చాటారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని నినదించారు. ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి సైతం ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బాబు అరెస్ట్‌పై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి 53వ రోజున అంటే 31 అక్టోబర్ 2023న జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. 

సీఎం కావడానికి అది కూడా ఒక కారణం!
జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల సమయంలో ఎండనక, వాననక అన్ని జిల్లాలను చుట్టేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని ఘన విజయం సాధించింది. అయితే, ఈ గెలుపునకు చంద్రబాబు అరెస్ట్ కూడా దోహదం చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అలాగే, జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేయడం, ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లడం కూడా కలిసివచ్చిందని చెప్తున్నారు.

  • Loading...

More Telugu News