Heavy Rains: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు... చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

AP govt announces holiday in two districts due to heavy rains

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
  • అధికారులను అప్రమత్తం చేసిన చంద్రబాబు

భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 

దాంతో, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు సోమవారం నాడు సెలవు ప్రకటించినట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా విద్యాసంస్థలకు సెలవుపై స్పందించారు. జిల్లాకు భారీ వర్షసూచన ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.

కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఏలేరు ప్రాజెక్టు స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని స్పష్టం చేశారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా చూసుకోవాలని సూచించారు. ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 

ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నచ్చచెప్పి పునరావాసా కేంద్రాలకు తరలించాలని చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వరదలు, వర్షాలపై ప్రజలకు అలర్ట్ సందేశాలను ఫోన్ ద్వారా పంపాలని సూచించారు. నాగావళి, వంశధార నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశముందని తెలిపారు. 

ఇక విశాఖలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 0891-2590102, 0891-2590100 కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు

  • Loading...

More Telugu News