Vangalapudi Anitha: జగన్ సొంత డబ్బుతో ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు: హోంమంత్రి అనిత

Home minister Anitha slams Jagan over Vijayawada flood

  • విజయవాడలో వరద పరిస్థితులపై హోంమంత్రి అనిత ప్రెస్ మీట్
  • చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లకుండా శ్రమిస్తున్నారని వెల్లడి
  • నిమ్మల బుడమేరు కట్టపైనే మూడ్రోజులు ఉన్నారని వివరణ
  • జగన్ బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు చెబుతున్నారని విమర్శలు

విజయవాడలో వరద పరిస్థితులు, సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు వినాయకచవితి పండుగ కూడా జరుపుకోకుండా క్షేత్రస్థాయిలో ఉంటూ శ్రమిస్తున్నారని అనిత పేర్కొన్నారు. వరద వచ్చినప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటూ, ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శిస్తూ, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 

నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడ్రోజుల పాటు బుడమేరు వద్దే మకాం వేసి, నిద్ర కూడా లేకుండా, గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇంతగా పాటుపడుతుంటే, జగన్ తన పేటీఎం బ్యాచ్ ను దించి విషప్రచారం చేయిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 

జగన్ తన సొంతడబ్బుతో కనీసం ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదని, బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారని విమర్శించారు. 

ఇక, విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిలిచే ఉందని వెల్లడించారు. వరద ముంపు బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తున్నామని... ఉదయం వేళల్లో టిఫిన్లు, మంచినీరు, పాల ప్యాకెట్లు అందించామని అనిత వివరించారు. 

నగరంలోని ముంపు కాలనీల్లో 170 వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయని, వాటర్ ట్యాంకులు రోజూ వందల ట్రిప్పులు తిరుగుతున్నాయని తెలిపారు. అగ్నిమాపక దళం సాయంతో ఇప్పటివరకు 27 వేలకు పైగా ఇళ్లలో బురదను తొలగించినట్టు అనిత పేర్కొన్నారు. 

డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు, క్లోరినేషన్ ప్రక్రియ కూడా చేపట్టామని వెల్లడించారు. కేవలం డ్రోన్ల సాయంతోనే లక్షకు పైగా ఆహార ప్యాకెట్లను బాధితుల వద్దకు చేర్చామని స్పష్టం చేశారు.

వినాయకచవితి మండపాలకు ఎలాంటి చలానాలు విధించలేదని వెల్లడించారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవో తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వమేనని అనిత ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే, ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేశారని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News