Nara Lokesh: ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ ప్రభుత్వంపై విమర్శలా?.. మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ మంత్రి లోకేశ్

AP Minister Nara Lokesh Fires On Former CM Jagan
  • బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ లోకేశ్ ఫైర్
  • సొంత డబ్బుతో మీరు కనీసం పులిహోర ప్యాకెట్ అందించారా? అంటూ నిలదీత 
  • 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు సాయం చేస్తున్నారని వెల్లడి
  • అలాంటి నాయకుడిపై విమర్శలు ఎలా చేస్తున్నారని నిలదీత
వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులను ఆదుకోవడానికి ఓవైపు 74 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు కష్టపడుతుండగా.. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి మాత్రం తన ప్యాలస్ లో సేదతీరుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. సహాయక కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నాయకుడిపై విమర్శలు ఎలా చేయగలుగుతున్నారని నిలదీశారు. బురద రాజకీయానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని లోకేశ్ విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష హోదా అందుకునే హుందాతనం మీకుందా జగన్ అని సూటిగా ప్రశ్నించారు. పాస్ పోర్ట్ సమస్య లేకుంటే జగన్ ఎప్పుడో లండన్ ఎగిరిపోయే వారని అన్నారు. విపత్తులతో ఇబ్బందిపడుతున్న జనాలకు ఏనాడైనా సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ పంచిన చరిత్ర ఉందా అని జగన్ ను లోకేశ్ నిలదీశారు. జగన్ సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందేనన్నారు. అప్పట్లో బుడమేరు ఆధునికీకరణకు చంద్రబాబు రూ.464 కోట్లు కేటాయించారని, పనులు కూడా ప్రారంభించారని లోకేశ్ గుర్తుచేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆ పనులను నిలిపివేశారని, ప్రస్తుత వరదలకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆధునికీకరణ, మరమ్మతు పనులను జగన్ ఆపేయగా.. ఆయన పార్టీ నేతలు దాదాపు 600 ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పారు. బుడమేరుకు 2022 లోనే గండి పడినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వహణ గాలికి వదిలేశారని ఆరోపించారు.

విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారని చెప్పారు. బుడమేరు పొంగడానికి కారణం జగనేనని, ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ఆరోపించారు. జగన్ పాలనా వైఫల్యాలు నేడు జనాలను కష్టాల్లోకి నెట్టాయని వివరించారు. సమస్యలన్నీ అధిగమిస్తామని, వరద బాధితులు అందరికీ సాయం అందించే వరకూ టీడీపీ ప్రభుత్వ యంత్రాంగం విశ్రమించబోదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh
AP Floods
Jagan
Chandrababu

More Telugu News