Leopard: రాజమండ్రి శివార్లలో చిరుతపులి సంచారం

Leopard spotted in Rajahmundry suburb areas

  • రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చిరుతపులి కదలికలు
  • 36 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీశాఖ సిబ్బంది
  • చిరుతను తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాజానగరం ఎమ్మెల్యే

రాజమండ్రి శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోంది. రాజమండ్రి-రాజానగరం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చిరుతపులి తిరుగుతున్నట్టు గుర్తించారు. దీనిపై ఇన్చార్జి డీఎఫ్ఓ భరణి స్పందించారు. 

చిరుత కదలికలు తెలుసుకునేందుకు 36 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జనసంచారం ఉండే రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టు తెలిసిందని అన్నారు. ఈ చిరుతపులి తిరిగి అటవీప్రాంతంలోకి వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

తప్పనిపరిస్థితులు ఏర్పడితే, ఉన్నతాధికారుల అనుమతితో చిరుతపులిని బంధిస్తామని ఇన్చార్జి డీఎఫ్ఓ వివరించారు. చిన్నపిల్లలను రాత్రిపూట బయటికి పంపవద్దని తల్లిదండ్రులకు  స్పష్టం చేశారు. ఎవరికైనా చిరుతపులి కనిపిస్తే టోల్ ఫ్రీ నెంబరు 1800 4255909కి సమాచారం అందించాలని సూచించారు. 

కాగా, రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు స్థానిక రేడియో స్టేషన్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ పంది వెంట చిరుత వెళుతున్న దృశ్యాలు ఫుటేజిలో దర్శనమిచ్చాయి. చిరుత సంచారంతో రాజమండ్రి శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. చిరుతపులిని త్వరగా పట్టుకోవాలని అధికారులను కోరారు.

  • Loading...

More Telugu News