Danish Kaneria: అందుకే పాకిస్థాన్ జట్టు ఇలాంటి దుస్థితిలో ఉంది: డానిష్ కనేరియా

Danish Kaneria comments on Pakistan Cricket Team

  • ఇటీవల దారుణంగా ఆడుతున్న పాక్ జట్టు
  • తరచుగా కెప్టెన్లను మార్చుతున్న పీసీబీ
  • కెప్టెన్లను మార్చడం వల్ల ప్రయోజనం లేదన్న కనేరియా
  • గంభీర్ లాగా కఠినంగా వ్యవహరించే వ్యక్తి పాక్ కోచ్ గా రావాలని వెల్లడి

పాకిస్థాన్ ముస్లిం ప్రాబల్య దేశం అని తెలిసిందే. అలాంటి దేశంలో ఓ హిందువు జాతీయ క్రికెట్ జట్టుకు ఆడడం మామూలు విషయం కాదు. కానీ, హిందు మతానికి చెందిన డానిష్ కనేరియా పాక్ జాతీయ జట్టుకు చాలా సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా, టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. 

చాన్నాళ్ల కిందటే  క్రికెట్ కు వీడ్కోలు పలికిన డానిష్ కనేరియా ప్రస్తుతం పాక్ జట్టు ఆటతీరు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్లలో బాధ్యతా రాహిత్యం తీవ్రస్థాయికి చేరిందని విమర్శించాడు. ఆటగాళ్లలో తాము జాతీయ జట్టుకు ఆడుతున్నామన్న స్పృహ లేదని, అందుకే పాక్ జట్టు ఇలాంటి దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఇలాంటి పరిస్థితుల్లో తరచుగా కెప్టెన్లను మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, గౌతమ్ గంభీర్ వంటి వ్యక్తి పాకిస్థాన్ కోచ్ గా రావాలని కనేరియా అభిప్రాయపడ్డాడు. గంభీర్ కఠినంగా వ్యవహరించే కోచ్ అని, అలాంటి కోచ్ లతోనే పాక్ జట్టులో మార్పును చూడగలని వివరించాడు. 

గంభీర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి అని, జట్టులో ఉన్నత స్థాయి పదవుల్లో ఉండే వ్యక్తికి ఉండాల్సిన లక్షణం అదేనని కొనియాడాడు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు గంభీర్ ఏమాత్రం వెనుకాడడని, ఇలాంటి వ్యక్తులే పాక్ జట్టుకు కోచ్ గా రావాలని పేర్కొన్నాడు. 

ఇక, కొత్తగా కెప్టెన్ ను నియమించినప్పుడు అతడికి ఏడాది పాటు సమయం ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశముంటుందని కనేరియా తెలిపాడు. కెప్టెన్ కు ఆటగాళ్ల సంపూర్ణ మద్దతు ఉండేలా చూడడం ముఖ్యమని, మెరుగైన ప్రదర్శన చేయని ఆటగాళ్లకు జట్టు నుంచి ఉద్వాసన పలకాలని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News