Tirumala: తిరుమల కొండపై విషాద ఘటన... క్యూలైన్ లో మహిళ హఠాన్మరణం

Woman dies in Tirumala que line

  • ఈ వేకువజామున క్యూ లైన్లో గుండెపోటుకు గురైన భక్తురాలు
  • ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి
  • టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు
  • మృతురాలిని కడపకు చెందిన ఝాన్సీగా గుర్తింపు
  • లండన్ లో స్థిరపడిన మహిళ

సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఝాన్సీ (32) మహిళ హఠాన్మరణం చెందింది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో నిలుచున్న ఆ భక్తురాలు గుండెపోటుతో కుప్పకూలింది. వెంటనే స్పందించిన ఇతర భక్తులు సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న స్థానిక వైద్య సిబ్బంది అంబులెన్స్ తో వచ్చారు. నర్సులు కూడా సీపీఆర్ చేసినా ప్రయోజనం కనిపించలేదు. 

ఆ భక్తురాలిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఈ వేకువ జామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతి చెందిన భక్తురాలి స్వస్థలం కడప అని గుర్తించారు. ఆమె లండన్ లో స్థిరపడినట్టు తెలిసింది. 

ఝాన్సీ అకాలమరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలికి కవల పిల్లలు ఉన్నారు. కాగా, అంబులెన్స్ రాక ఆలస్యమైందని, క్యూలైన్ లో కనీసం సమాచారం అందించేందుకు ఫోన్ సౌకర్యం కూడా లేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుమల కొండపై ఓ మోస్తరుగా భక్తుల రద్దీ

తిరుమల కొండపై భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టోకెన్లతో వచ్చిన భక్తులను, క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండాల్సిన పని లేకుండా, అధికారులు నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. 

నిన్న శుక్రవారం నాడు స్వామివారిని 58,100 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.39 కోట్ల ఆదాయం వచ్చింది. 

More Telugu News