Hina Khan: బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హీనా ఖాన్‌కు మరో షాక్.. మ్యూకోసైటిస్ నిర్ధారణ.. సాయం చేయాలని వేడుకోలు!

Actress Hina Khan diagnosed with mucositis

  • కొన్ని నెలల క్రితమే స్టేజ్3 రొమ్ము క్యాన్సర్ బారినపడిన హీనాఖాన్
  • కోకిలాబెన్ ఆసుపత్రిలో కీమోథెరపీ చేయించుకుంటున్న నటి
  • దాని దుష్ప్రభావమే మ్యుకోసైటిస్
  • రెమిడీ ఏమైనా ఉంటే చెప్పాలని అభిమానులకు విజ్ఞప్తి 

బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనాఖాన్‌కు మరో కష్టం వచ్చిపడింది. తాజాగా ఆమె మ్యూకోసైటిస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నారు. తానేమీ తినలేకపోతున్నానని, రెమిడీలు ఏమైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోవాలని కోరారు.  నిన్న సాయంత్రం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

తాను మ్యూకోసిస్ బారినపడ్డానని, వైద్యుల సలహాలు కూడా పాటిస్తున్నానని ఆ పోస్టులో ఆమె పేర్కొన్నారు. మీలో ఎవరైనా ఈ సమస్యను ఎదుర్కొన్నా, లేదంటే ఏదైనా ఉపయోగకరమైన నివారణ మార్గాలు ఉన్నా తనకు చెప్పాలని వేడుకున్నారు. ఏమీ తినలేని పరిస్థితి దారుణమని, కాబట్టి తనకు సాయం చేయాలని కోరుతూ చేతులు జోడించిన ఎమోజీతో పోస్టును షేర్ చేశారు. 

మ్యూకోసైటిస్ అంటే?
మ్యూకోసైటిస్ అనేది కీమోథెరపీ దుష్ప్రభావాల్లో ఒకటి. దీనివల్ల నోరు, గొంతు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మ పొరలు వాచిపోతాయి. ఇది తాత్కాలికమే అయినా బాధ విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు అది దానంతట అదే తగ్గిపోతుంది. హీనాకు స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు కొన్ని నెలల క్రితమే బయటపడింది. చికిత్సలో బాగంగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు.  ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తన  చికిత్సకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో ఆమె పంచుకుంటున్నారు.

More Telugu News