Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లో సీతారాం ఏచూరి.. పరిస్థితి విషమం

CPIM general secretary Sitaram Yechury has been shifted to the ventilator at AIIMS Hospital

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సీపీఎం సీనియర్ నేత
  • ఆగస్టు 19నే హాస్పిటల్‌లో చేరిక
  • ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స 

సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను గురువారం రాత్రి వెంటిలేటర్‌పై ఉంచి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

కాగా సీతారాం వయసు 72 సంవత్సరాలు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి తరలించాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారని సమాచారం. అయితే చికిత్సకు సంబంధించిన వివరాలను హాస్పిటల్ ప్రకటించలేదు. మరోవైపు ఇటీవలే ఆయన కంటికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు.

సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన
సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆగస్టు 31నే సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది. ‘‘భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News