Simi Singh: ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న భారత సంతతి క్రికెట్‌ స్టార్

Indian Origin Star Simi Singh Who Played 53 T20Is For Ireland Battling For Life

  • ఐర్లాండ్ తరఫున క్రికెట్‌ ఆడిన భారత సంతతి ఆల్ రౌండర్ సిమీ సింగ్ 
  • ప్ర‌స్తుతం కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న క్రికెట‌ర్‌
  • గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సిమీ
  • ఐర్లాండ్ త‌ర‌ఫున 35 వన్డేలు, 53 టీ20లకు ప్రాతినిధ్యం  

ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడిన భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ సిమీ సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్రికెటర్ గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో నిర్వహించే కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 

మొహాలీలో జన్మించిన సిమీ అండ‌ర్‌-14, అండ‌ర్‌-17 స్థాయిలలో పంజాబ్ తరపున ఆడాడు. కానీ, అండ‌ర్‌-19 జట్టులో చోటు ద‌క్క‌లేదు. దాంతో అతను హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు కోసం ఐర్లాండ్ వెళ్లాడు. అనంత‌రం 2006లో సిమీ సింగ్‌ డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ క్లబ్‌లో ప్రొఫెషనల్ క్రికెట‌ర్‌గా చేర‌డం జ‌రిగింది. అలా అత‌ను ఐర్లాండ్ త‌ర‌ఫున 35 వన్డేలు, 53 టీ20లకు ప్రాతినిధ్యం వ‌హించాడు. వ‌న్డేల్లో 39 వికెట్లు, టీ20ల్లో 44 వికెట్లతో ఐర్లాండ్ తరపున ప్రముఖ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. అలాగే 2021లో దక్షిణాఫ్రికాపై వన్డే సెంచరీ కూడా న‌మోదు చేశాడు.

సిమీ సింగ్ బావ పర్వీందర్ సింగ్ తాజాగా అత‌ని ఆరోగ్య‌ పరిస్థితిపై 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో మాట్లాడాడు. "ఐదారు నెలల క్రితం అతను ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్నప్పుడు ఒక వింత‌ జ్వరం వచ్చింది. ఇప్ప‌టికీ వస్తూనే ఉంటుంది. దాంతో సిమీకి అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వ‌హించాం. కానీ ఆ టెస్టుల్లో ఎటువంటి జ‌బ్బు నిర్ధారణ కాలేదు. అక్కడి వైద్యుల స‌ల‌హా మేర‌కు కొన్ని మెడిసిన్స్ వినియోగించాం. 

అయినా సిమీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. పైగా అత‌ని ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డం మొద‌లైంది. దాంతో మేము మెరుగైన వైద్యం కోసం ఇండియాకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాం. జూన్ చివరలో సిమీని తీసుకుని మొహాలీకి వ‌చ్చాం. జులై ప్రారంభంలో చండీగఢ్‌లో టీబీకి చికిత్స అందించారు. ఆ తర్వాత అతనికి టీబీ లేదని ఫలితాలు వచ్చాయి.

కానీ, అతనికి జ్వరం తగ్గకపోవడంతో మ‌ళ్లీ మొహాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లా. అక్కడ, సిమీకి టీబీ లేదని చెప్పారు. కానీ ఆరు వారాల మందుల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని సూచించారు. అలా టీబీ మందులతో పాటు అతనికి స్టెరాయిడ్లు కూడా ఇచ్చారు. దాంతో అతనికి జ్వరం మళ్లీ పెరగడం మొద‌లైంది. ఆగస్టు చివరి వారంలో మేము అతనిని పీజీఐకి తీసుకెళ్లాం. 

అతని ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. సిమీ తీవ్రమైన కాలేయ వైఫల్యానికి గురయ్యాడని గుర్తించిన పీజీఐ వైద్యులు అత‌డిని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రికి తీసుకెళ్లమని రిఫ‌ర్ చేశారు. ఎందుకంటే అతను కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని వారు చెప్పారు. దాంతో సెప్టెంబరు 3న మేదాంతకు వచ్చాం" అని పర్వీందర్ సింగ్ చెప్పాడు.

ప్ర‌స్తుతం సిమీ కాలేయ మార్పిడి కోసం వేచి చూస్తున్నాడు. అతని భార్య అగందీప్ కౌర్ తన కాలేయంలో కొంత‌ భాగాన్ని దానం చేయడానికి అంగీకరించింది. దాంతో త్వ‌ర‌లోనే సిమీకి వైద్యులు ఆప‌రేష‌న్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

  • Loading...

More Telugu News