Kolkata Doctor: పోలీసులపై కోల్ కతా వైద్యురాలి పేరెంట్స్ సంచలన ఆరోపణలు

Parents Of Kolkata Doctor Claim Police Tried To Bribe Them After Daughters Murder

  • కేసును నీరుగార్చేందుకు తమకు డబ్బులు ఇవ్వజూపారని వెల్లడి
  • మృతదేహాన్ని చూపించేందుకు చాలాసేపు వెయిట్ చేయించారని ఫైర్
  • కోల్ కతాలో బుధవారం రాత్రి నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైద్యురాలి పేరెంట్స్

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మర్డర్ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమకు వ్యతిరేకంగానే ఉన్నారని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం క్యాండిల్స్ తో వైద్యురాలికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కూతురు మృతదేహాన్ని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని, చాలాసేపు పోలీస్ స్టేషన్ లోనే తమను కూర్చోబెట్టారని ఆరోపించారు.

మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్నపుడు కూడా తమను పోలీస్ స్టేషన్ నుంచి కదలనివ్వలేదని మండిపడ్డారు. కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని తమకు అప్పగిస్తూ ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ డబ్బులు ఆఫర్ చేశారని, మేం వెంటనే తిరస్కరించామని వైద్యురాలి తండ్రి చెప్పారు. తమ కూతురుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ఆమెకు న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మద్దతుగా తాము పాల్గొన్నామని వివరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దారుణ హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం జరగాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News