Vladimir Putin: రష్యాను ఎప్పటికీ ఏలేసే ప్లాన్.. అమరత్వం కోసం పుతిన్ పాకులాట!

Russia President Vladimir Putin Seeks Immortality

  • ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోవాలని పుతిన్ ప్లాన్
  • జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే పరిశోధనలను వేగవంతం చేయాలని పరిశోధకులకు ఆదేశం
  • జూన్‌లో రాసిన లేఖను బయటపెట్టిన ‘డెయిలీ మెయిల్’
  • అలాంటి ఔషధం తయారుచేసేందుకు బిలియన్ డాలర్ల ఖర్చుతోపాటు కొన్ని సంవత్సరాలు పడుతుందంటున్న శాస్త్రవేత్తలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమరత్వం కోసం పాకులాడుతున్నారా? ఈ భూమిపై చిరంజీవిగా ఉండిపోయి కలకాలం రష్యాను ఏలేద్దామనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలను పుతిన్ ఆదేశించినట్టు ‘డెయిలీ మెయిల్’ ఓ కథనం ప్రచురించింది. జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే పరిశోధనలపై ఏం చేశారని ప్రశ్నిస్తూ ఈ ఏడాది జూన్‌లో వైద్యులు, వైద్య పరిశోధకులకు ఆ దేశ మంత్రిత్వశాఖ లేఖ రాసిన విషయాన్ని ఈ కథనంలో గుర్తు చేసింది.

‘‘బిగ్గెస్ట్ బాస్’ ఓ పని అప్పగించారు. అధికారులు ఆ పనిని పూర్తిచేసే పనిపై ఉన్నారు’ అని మెడికల్ రీసెర్చర్ ఒకరిని డెయిలీ మెయిల్ తన కథనంలో ఉటంకించింది. తమ పనులు ఎంత వరకు వచ్చాయో చెప్పాలంటూ తాజాగా ఓ లేఖ వచ్చినట్టు ఆయన వివరించారని తెలిపింది. 

అధ్యక్ష భవనం నుంచి వచ్చిన డిమాండ్లు తమను షాక్‌కు గురిచేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి ఔషధాన్ని కనుగొనేందుకు ఏళ్ల సమయం పడుతుందని, బిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చవుతుందని వారు పేర్కొన్నారు. కణాల క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు సంబంధించిన పని ఎంతవరకు వచ్చిందో వెంటనే తెలియజేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్నట్టు వారు వివరించారు. అంతేకాదు, ఇంద్రియ బలహీనతను నిరోధించే కొత్త సాంకేతికతలు, రోగ నిరోధక వ్యవస్థను సరిదిద్దే పద్ధతుల గురించి కూడా చెప్పాలని పరిశోధకులను ఆదేశించినట్టు కథనం పేర్కొంది.  
 
ప్రస్తుతం పుతిన్ చుట్టూ ఉన్న వారంతా వృద్ధులే. సెనేట్ స్పీకర్ వాలెంటినీ మట్వియెంకో (75), విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ (74), ఎఫ్ఎస్‌బీ సెక్యూరిటీ సర్వీస్ చీఫ్ అలెగ్జాండర్ బార్ట్‌నికోవ్ (72), ఎస్వీఆర్ స్పై చీఫ్ సెర్గీ నరిష్కిన్ (69) వంటి వారు వీరిలో ఉన్నారు. ఇక పుతిన్ వయసు 71 సంవత్సరాలు. గత ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్ 2036 వరకు అధికారంలో ఉండనున్నారు. అప్పటి వరకు ఆయన వయసు 83 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కూడా రష్యాను ఏలేయాలన్న పట్టుదలతో ఉన్న పుతిన్ ఈ ‘అమృత‘ ఔషధం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పుతిన్ 64 ఏళ్ల వయసులో ఉండగా 2016లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బయోకాడ్ ప్లాంట్‌ను సందర్శించారు. ఇది యాంటీ ఏజింగ్ మాత్రల అభివృద్దిపై పనిచేస్తోంది.

  • Loading...

More Telugu News