Vijayawada Floods: విజయవాడలో వరద ఉద్ధృతి తగ్గుతోంది: మంత్రి నారాయణ
- విజయవాడలో క్రమంగా సాధారణ పరిస్థితులు
- 8.5 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామన్న మంత్రి నారాయణ
- విజయవాడలో కాలువల్లో పూడిక పేరుకుపోయిందని వెల్లడి
- రేపటి నుంచే పూడిక తొలగిస్తామని స్పష్టీకరణ
ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. నిన్న 11 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా, నేడు అది 7 లక్షలకు తగ్గింది. అటు విజయవాడ నగరంలోనూ పరిస్థితులు కొద్దిగా మెరుగయ్యాయి.
ఈ నేపథ్యంలో, మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో వరద ఉద్ధృతి తగ్గుతోందన్నారు. వరద బాధితులందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇవాళ 8.5 లక్షల భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు. అదే సంఖ్యలో అల్పాహార పొట్లాలను కూడా అందజేశామని మంత్రి నారాయణ వివరించారు.
విజయవాడలో కాలువల్లో పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోయిందని, వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లపై భారీగా మట్టి, ఇసుక చేరిందని, యుద్ధ ప్రాతిపదికపై ఆ మట్టి, ఇసుక తొలగిస్తామని వెల్లడించారు. నీరు తగ్గాక, రోడ్లపై మురుగు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రేపటి నుంచే ఈ కార్యాచరణ మొదలవుతుందని చెప్పారు.
పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఒక్కో డివిజన్ ను ఒక్కో మున్సిపల్ కమిషనర్ కు అప్పగించామని, ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేక అధికారి ఉంటారని వివరించారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కోసం 10 వేల మంది కార్మికులు కావాలని నారాయణ పేర్కొన్నారు.
వరద నీరు తగ్గాక అగ్నిమాపక శాఖ ట్యాంకర్లతో రోడ్లు శుభ్రం చేస్తామని చెప్పారు. అంటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, ఫాగింగ్ పనులు చేపడతామని... వైద్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.