Bengaluru Scam: బెంగళూరులో కొత్త రకం స్కాం.. ఓ మహిళ 15 ఏళ్ల కుమార్తెతో వచ్చి డోర్ కొడుతుంది.. ఆ తర్వాత జరిగేది ఇదే!

Be Alert New Scam In Bengaluru

  • కుమార్తెతో ఇల్లిల్లూ తిరుగుతున్న మహిళ
  • పక్కనే ఉన్న గుడిలో తన కుమార్తెకు మరికాసేపట్లో పెళ్లి అని నమ్మించే యత్నం
  • రూ. 15 వేలు తక్కువగా ఉన్నాయని, సాయం చేయాలని వేడుకోలు
  • తనకు ఎదురైన అనుభవాన్ని రెడిట్‌లో పంచుకున్న యూజర్
  • ఇది పాత స్కామేనంటూ తమ అనుభవాలను కూడా పంచుకున్న యూజర్లు

బెంగళూరులో ఇప్పుడు ఓ కొత్తరకం స్కాం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి ప్రతి ఇల్లు తిరుగుతూ తలుపు కొడుతుంది. కుమార్తెను చూపిస్తూ ఈ పక్కనే ఉన్న గుడిలో పెళ్లి జరగాల్సి ఉందని, అందుకు రూ. 15 వేలు తగ్గాయని, దయచేసి సర్దాలని వేడుకుంటుంది. పెళ్లి కూతురులా ముస్తాబై ఉన్న బాలికను చూసి నిజమే కాబోలని కొందరు అంతో ఇంతో సర్దుతున్నారు. ఇలానే తనకు ఎదురైన అనుభవాన్ని ‘కేవీఏకే95’ అనే రెడిట్ యూజర్ పంచుకున్నాడు. 

వీకెండ్ కావడంతో బిర్యానీ తెచ్చకుని తిని నిద్ర పోతుండగా డోర్ బెల్ ఒకటే మోత మోగడంతో వెళ్లి తీశానని, 40 ఏళ్లు ఉండే ఓ మహిళ, 15 ఏళ్లు ఉండే బాలికతో కలిసి కనిపించిందని తెలిపాడు. తనను చూసిన వెంటనే ఆమె ‘మాడువే’ అని కన్నడలో అందని, తనకు కన్నడ అంతగా రాకపోయినా.. పెళ్లా? అని అడిగానని పేర్కొన్నాడు. ఆ తర్వాత తనకు తెలుగు వచ్చని చెప్పడంతో ఆమె తెలుగులో మాట్లాడినట్టు  వివరించాడు. 

ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఈ పక్కనే ఉన్న ఆలయంలో మరికాసేపట్లో తన కుమార్తె పెళ్లి జరగబోతుందని, ఖర్చులకు రూ. 15 వేలు  తక్కువగా ఉన్నాయని, సాయం చేయాలని కోరిందని తెలిపాడు. అయితే, అప్పటికే నిద్ర మత్తులో తూగుతున్న తాను కుదరదని చెప్పి గట్టిగా అరుస్తూ తలుపు మూసేశాని తెలిపాడు. అయితే, ఆ తర్వాత బాధ అనిపించిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇలా మీ దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా యూజర్లను హెచ్చరించాడు. ఆమె కుమార్తెగా చెప్పుకుంటున్న అమ్మాయి వయసు 15 ఏళ్లకు మించి ఉండదని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయాలా? అని సలహా అడిగాడు. 

ఆయన పోస్టు చూసిన చాలామంది తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని చెబుతూ పోస్టులు పెట్టారు. ఇదంతా పెద్ద స్కాంలా ఉందని చెప్పుకొచ్చారు. ఇది పాత స్కామేనని, 2002లో గుజరాత్‌లో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని చెబుతూ మొత్తం స్టోరీని ఓ యూజర్ రాసుకొచ్చాడు. తన తల్లిదండ్రులు తనకు పాకెట్ మనీ ఇవ్వరని, కాబట్టి తన వద్దనున్న 2 రూపాయలు ఆమె చేతిలో పెట్టానని గుర్తు చేసుకున్నాడు. అవి తీసుకున్న ఆమె థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయిందని వివరించాడు.

More Telugu News