Ravindra Jadeja: తోటి స్పిన్నర్ రవీంద్ర జడేజాపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Jadeja is the most talented cricketer I have seen says Ravichandran Ashwin

  • తాను చూసిన అత్యంత ప్రతిభావంతుడైైన క్రికెటర్ జడేజా అని ప్రశంసించిన అశ్విన్
  • జడేజా విషయంలో తనకు అసూయ లేదని వ్యాఖ్య
  • ఒకరి వైవిధ్యాలను మరొకరం అర్థం చేసుకుంటామని వెల్లడి

టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దాదాపు రెండు దశాబ్దాలుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జట్టుకు కీలకమైన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్ల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. స్వదేశీ పరిస్థితులలో ఇద్దరికీ సమష్టిగా బౌలింగ్ అవకాశాలు లభిస్తుండగా.. విదేశాల్లో ఆడే టెస్టులకు మాత్రం జడేజా కంటే అశ్విన్‌కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంటుంది. కాగా తోటి స్పిన్నర్ జడేజాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు.

తాను చూసిన అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ జడేజా అని అశ్విన్ మెచ్చుకున్నాడు. సహజసిద్ధమైన ఆటగాడని, కొన్నేళ్లలో తమ మధ్య బంధం మెరుగుపడిందని, ఒకరి వైవిధ్యాలను మరొకరం అర్థం చేసుకోవడం అలవర్చుకున్నట్టు చెప్పాడు. తాను చాలా ఆలోచిస్తానని, అయితే జడేజా అలా చేయడని, అది అర్థం చేసుకోవడానికి తనకు సమయం పట్టిందని అశ్విన్ వివరించాడు. ప్రస్తుతం తాము బలమైన క్రికెట్ సంబంధాన్ని కలిగి ఉన్నట్టు వ్యాఖ్యానించాడు.

విదేశాల్లో జడేజా కంటే మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా? అని ప్రశ్నించగా.. ‘మీరు అసూయ గురించి మాట్లాడుతున్నారు’’ అని అశ్విన్ అన్నాడు. జడేజా పట్ల తనకు ఎలాంటి అసూయ లేదని స్పష్టం చేశాడు. సాటి క్రికెటర్లుగా అధిగమించాల్సిన పరిస్థితి కూడా ఇదేనని అభిప్రాయపడ్డాడు.

‘‘జట్టులో నేను ఆడకపోవడం జడేజా తప్పు కాదు. నేను ఆడడం కోసం అతడిని దూరంగా ఉంచాలనే అసూయ నాకు లేదు. అసూయ అనే భావనను అధిగమించాలి. జాతీయ జట్టులో ఆడని ఆటగాళ్లతో ఎలాంటి అపార్థాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వారితో సరైన కమ్యూనికేషన్‌ను కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం జట్టులో లేని ఆటగాళ్లతో వ్యవహరించే విధానం చాలా కీలకం. జట్టులో ఏ ఆటగాడైనా చోటు కోల్పోతే అది అతడి తప్పు కాదు. ఇతరుల అవకాశం, జట్టులో మార్పులకు సంబంధించినది’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. విమల్ కుమార్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News