Harish Rao: ఇంట్లో వరద నీరు... చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: హరీశ్ రావు

Harish Rao tweet on Floods

  • వరద విలయతాండవం సృష్టించిందన్న హరీశ్ రావు
  • ప్రభుత్వం కొంతకాలం కూల్చివేతలు, శుష్క రాజకీయాలు ఆపేయాలని హితవు
  • బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని హితవు

భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. "ఇంట్లో వరద నీరు... కంట్లో ఎడతెగని కన్నీరు... ఈ వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అంటూ హరీశ్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

వర్షాలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నందున... ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపేసి బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. తక్షణ సహాయ చర్యలు అందడం లేదని ప్రజలు ఆవేదన చెందుతుండటంతో పాటు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆహారం, నీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విషజ్వరాలతో విలవిల్లాడుతోందని, ఇప్పుడు వర్షాలు, వరదల వల్ల విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని శాఖలు అప్రమత్తం కావాలని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ప్రతి ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News