AP Rains: ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద.. గేటును ఢీ కొట్టిన బోటు

Record Flood To Prakasham Barriage

  • వరుసగా కొట్టుకొచ్చిన నాలుగు బోట్లు
  • ప్రమాదవశాత్తూ కొట్టుకొస్తున్నాయా లేక కుట్రనా? అని ఆరా తీస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి కనీవినీ ఎరగని స్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. చరిత్రలోనే తొలిసారిగా బ్యారేజీకి 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లు తెరిచి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఎగువ నుంచి కొట్టుకువచ్చిన ఓ బోటు 69వ నెంబర్ గేటును ఢీ కొట్టింది. దీంతో స్వల్పంగా డ్యామేజీ జరిగింది. 

బోటు ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందని అధికారులు పరిశీలిస్తున్న క్రమంలోనే మరో నాలుగు బోట్లు కొట్టుకొచ్చాయి. దీంతో అధికారులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కొట్టుకువచ్చాయా లేక ఎవరైనా కావాలని బోట్లను వదిలారా? అని అనుమానిస్తున్నారు. గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచాలనే ఉద్దేశంతో.. బోటు అడ్డుతగిలిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం నీటి ప్రవాహాన్ని పెంచేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు వున్నాయి. తాజాగా నాలుగు బోట్లు కొట్టుకురావడంతో నాడు జరిగిన సంఘటనను అధికారులు గుర్తుచేస్తున్నారు. ఈ బోట్లు కొట్టుకురావడం వెనక ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

బ్యారేజీపై రాకపోకలు బంద్?
ప్రకాశం బ్యారేజీ వద్ద 23.6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఈ స్థాయిలో వరద గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ దిగువన పలు గ్రామాలు నీటమునిగాయని వివరించారు. గేట్లను పూర్తిగా పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బ్యారేజీపై రాకపోకలను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు, రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గతంలో ప్రకాశం బ్యారేజీకి 1903వ సంవత్సరంలో 10.60 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత 2009 అక్టోబర్ లో 10.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ప్రస్తుతం 11.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News