MS Dhoni: క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

Yograj Singh lashed out at MS Dhoni for ruining Yuvrajs career

  • తన కొడుకు కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడన్న యోగ్‌రాజ్ సింగ్
  • యూవీ క్రికెట్ కెరీర్‌ కనీసం నాలుగేళ్లు తగ్గడానికి కారణమయ్యాడని ఆరోపణ
  • యువరాజ్ సింగ్‌ ‘భారత రత్న’కు అర్హుడని వ్యాఖ్య

ప్రముఖ క్రికెట్ కోచ్, భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ తన కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడని ఆరోపించారు. యూవీ క్రికెట్ జీవితాన్ని కనీసం నాలుగేళ్లు తగ్గించాడని మండిపడ్డారు. యువరాజ్ సింగ్ సీనియర్ జాతీయ జట్టుకు చాలా సహకారం అందించాడని, అతడొక అసమాన ఆల్‌రౌండర్ అని ప్రశంసించారు. ఇద్దరూ జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో యూవీ కెరీర్‌ను ధోనీ ఇబ్బందుల్లోకి నెట్టాడని ఆరోపించారు.

‘‘ఇంకా నాలుగైదేళ్లు ఆడగల నా కొడుకు జీవితాన్ని అతడు నాశనం చేశాడు. యువరాజ్ లాంటి కొడుకుని సిద్దం చేయాలని అందరికీ సవాలు విసురుతున్నాను. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్ మరొకరు ఉండరని అన్నారు. ఎంఎస్ ధోనీని నేను క్షమించను. అతడు తనను తాను అద్దంలో చూసుకోవాలి. ధోనీ ప్రముఖ క్రికెటర్. ఆ విషయంలో అతడికి నేను సెల్యూట్ చేస్తాను. కానీ నా కొడుకు విషయంలో అతడు చేసింది క్షమించరానిది. అన్నీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పటికీ క్షమించలేం’’ అని యోగ్‌రాజ్ అన్నారు. ‘స్విచ్’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ యువరాజ్ సింగ్‌ ‘భారతరత్న’ పురస్కారానికి అర్హుడని, ఈ మాజీ ఆల్ రౌండర్‌కు అత్యున్నత పౌర పురస్కారం అందించాలని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ అసమానమైనదని, తన కెరీర్‌లో 'సెకండ్ ఇన్నింగ్స్' కూడా ఉందని, క్యాన్సర్‌పై గెలిచిన తర్వాత చిరస్మరణీయ రీతిలో పునరాగమనం చేశాడని ఆయన గుర్తుచేసుకున్నారు. 

కాగా యోగ్‌రాజ్ సింగ్.. ఎంఎస్ ధోనీపై, ఇతర క్రికెటర్లపై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ధోనీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి ఆయన విరుచుకుపడ్డారు.

కాగా యువరాజ్, ధోనీ కలిసి ఇండియాకు అన్ని ఫార్మాట్లలో కలిపి ఏకంగా 273 మ్యాచ్‌లు ఆడారు. ఎన్నో చిరస్మరణీయ భాగస్వామ్యాలను కూడా నెలకొల్పారు. ఇద్దరూ ఒకే సమయంలో ఎదిగారు. అయితే ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్‌ను గెలవడంతో అతడు హీరోగా మారిపోయాడు. దీంతో యువరాజ్ సింగ్‌కు తగిన గుర్తింపు దక్కలేదని యోగ్‌రాజ్ సింగ్‌తో పాటు యూవీ అభిమానులు భావిస్తుంటారు.

  • Loading...

More Telugu News