Chandrababu: వాళ్లకు ఇదే పని... అలాంటి వాళ్లకు ఏం చేయాలో అదే చేస్తా: సీఎం చంద్రబాబు

CM Chandrababu fires on false news

  • ఏపీలో భారీ వర్షాలు, వరదలు
  • నేడు కూడా సమీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు
  • ఏపీలో ఓ భ్రష్టు పార్టీ ఉందంటూ విమర్శలు
  • అమరావతి మునిగిపోయిందంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

అమరావతి మునిగిపోయిందని, ఇక్కడేం రాజధాని కడతారంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లెవరూ ఈ విధంగా మాట్లాడరని అన్నారు. చేతనైతే ఏదైనా సహాయం చేయండి... అంతేకానీ ఇలా తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో ఒక భ్రష్టుపట్టిన పార్టీ ఒకటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అది ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ అని అభివర్ణించారు. 

"వాళ్లకు ఇదే పని... ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడం, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, ఆ ఫ్రాడ్ న్యూస్ ని దేశమంతా వ్యాప్తి చేయడం, ఏదో జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టడం.  నేను చాలా  స్పష్టంగా చెబుతున్నా... వాస్తవాలు రాస్తే నేనేమీ మాట్లాడను. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాను. తప్పుడు వార్తలు రాసినప్పుడు అందులోని అంశాలను నిరూపించాల్సిన బాధ్యత కూడా వాళ్లపై ఉంటుంది. ఆధారాలు చూపించకుండా ఏదంటే అది మాట్లాడుతుండడం సరికాదు. దానికి ఏం చేయాలో అదే చేస్తాను" అని హెచ్చరించారు. 

ముంపు ప్రాంతాలు పెరిగింది అందువల్లే

అసాధారణ రీతిలో వర్షాలు కురవడం వల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని చంద్రబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణం అని పేర్కొన్నారు. వాయుగుండం తీరం దాటిన చోట కంటే ఇతర ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురిశాయని వివరించారు. కొన్ని చోట్ల 20 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. 

ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని చంద్రబాబు వెల్లడించారు. ఇవాళ ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ వర్షం పడుతోందని తెలిపారు. కాజ టోల్ గేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందని అన్నారు.

వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం

జలాశయాలన్నీ దాదాపుగా నిండిపోయాయని అన్నారు. వాగులు, చెరువులకు నీరు వెళ్లే దారిలో సత్వర క్లియరెన్స్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సత్వర చర్యలు చేపట్టామని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. 

కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధ కలిగించింది

వర్షాలు, వరదల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడి పలువురు చనిపోవడం బాధాకరమని అన్నారు. వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం విచారకరమని పేర్కొన్నారు. 

ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలి

భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. వరద బాధితుల కోసం 107 శిబిరాలు ఏర్పాటు చేశామని, 17 వేల మందిని తరలించామని వెల్లడించారు. 

వరద ముంపు ప్రాంతాలకు బోట్లు పంపించామని... ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేశామని తెలిపారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు బియ్యం, పంప్పు, నూనె, చక్కెర, కూరగాయలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. 

ప్రకాశం బ్యారేజికి భారీ వరద వస్తోంది

పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోందని, ప్రకాశం బ్యారేజికి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. బుడమేరు వల్ల వీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కింద పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని, గట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు వేస్తున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News