Heavy Rains: కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం.. కృష్ణా జిల్లాలో కొట్టుకుపోయిన యువకుడు.. వీడియో ఇదిగో!
- అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య తీరం దాటిన వాయుగుండం
- నేటి సాయంత్రం, లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం
- రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- అస్తవ్యస్తమైన జీనజీవనం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. రవాణా సౌకర్యాన్ని అస్తవ్యస్తం చేశాయి. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాటు చేసింది. వర్షాలు తగ్గేవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బైక్‌పై వెళ్తూ కొట్టుకుపోయిన యువకుడు
కృష్ణా జిల్లా చంద్రాలపాడు మండలంలోని ముప్పాల గ్రామంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ఓ యువకుడు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.