Crime News: కన్నతల్లిని కడతేర్చి.. డెడ్‌బాడీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొడుకు

Sorry mom I kill you a youth posted his mother deadbody Photo on Instagram

  • గుజరాత్‌లో దారుణానికి పాల్పడ్డ 21 ఏళ్ల యువకుడు
  • 'సారీ అమ్మ. నేను నిన్ను చంపాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన నిందితుడు
  • మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తల్లితో ఘర్షణ.. హత్య
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణం వెలుగుచూసింది. నీలేశ్ గోసాయి అనే 21 ఏళ్ల యువకుడు తన కన్నతల్లిని కడతేర్చాడు. దుప్పటితో గొంతునులిమి చంపేశాడు. అయితే హత్య తర్వాత తల్లి మృతదేహం పక్కన తాను ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘సారీ అమ్మ నేను నిన్ను చంపేశాను. నేను నిన్ను కోల్పోతున్నాను. ఓం శాంతి’’ అని పోస్ట్ పెట్టాడు. మరో పోస్ట్‌ పెట్టి ‘‘నేను మా అమ్మను చంపాను. నా జీవితాన్ని కోల్పోయాను. క్షమించు అమ్మ. ఓం శాంతి. మిస్ యూ అమ్మ’’ అని రాసుకొచ్చాడు.

ఇరుగుపొరుగు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్యకు గురైన మహిళ పేరు జ్యోతిబెన్ గోసాయి అని, ఆమె వయసు 48 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు. తొలుత తన తల్లిపై కత్తితో దాడికి ప్రయత్నించానని, అయితే ఆమె కత్తిని లాక్కుందని, ఆ తర్వాత దుప్పటితో గొంతునులిమి ప్రాణాలు తీసినట్టు దర్యాప్తులో నీలేశ్ అంగీకరించాడని పోలీసులు వివరించారు. నేరానికి పాల్పడ్డ తర్వాత అతడు తల్లి డెడ్‌బాడీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడని చెప్పారు.

కాగా హత్యకు గురైన జ్యోతిబెన్ కొన్నేళ్లుగా తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని పోలీసులు తెలిపారు. ఆమెకు, కొడుకు నీలేశ్ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవని, భౌతిక దాడులు కూడా చేసుకునేవారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిట్టు వెల్లడించారు. హత్యకు ముందు కూడా తల్లి, కొడుకు మధ్య ఘర్షణ జరిగిందని, తీవ్ర వాగ్వాదం కాస్తా నేరానికి దారితీసిందని వివరించారు.

మృతురాలు జ్యోతిబెన్‌ 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయారు. అప్పటి నుంచి నీలేశ్‌తో జీవించింది. భర్త, మిగతా పిల్లలు వీరితో సంబంధం లేకుండా దూరంగా వేరే చోట నివసిస్తున్నారు. మానసిక సమస్యలకు ఆమె చాలా కాలం నుంచి చికిత్స పొందుతోంది. అయితే గత నెల రోజుల నుంచి ఆమె మందులు వాడడం మానేసిందని, దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా జ్యోతిబెన్ మాజీ భర్త, మిగతా పిల్లలకు సమాచారం అందించామని.. మృతదేహాన్ని తీసుకునేందుకు వారు నిరాకరించారని, తమకు ఎలాంటి సంబంధం లేదన్నారని వెల్లడించారు. దీంతో పోలీసులే జ్యోతిబెన్‌కు అంత్యక్రియల ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇక నీలేశ్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ హత్యపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News