Danish Kaneria: భారత జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదు.. పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

Indian team should not go to Pakistan says Pakistan Ex Spinner Danish Kaneria

  • పాక్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత జట్టు వెళ్లకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డ మాజీ స్పిన్నర్
  • ఆటగాళ్ల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాఖ్య
  • హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌ వేదికగా ఆడించడం మెరుగని సూచన

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దౌత్య బంధాలు దెబ్బతినడం క్రికెట్ సంబంధాలను చెడగొట్టింది. దీంతో దాదాపు దశాబ్ద కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు భారత జట్టు ఆతిథ్య పాకిస్థాన్‌కు వెళుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

అయితే అంతా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీంతో పాక్‌కు భారత జట్టు పయనంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదని, హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో ఆడడం మెరుగని అన్నాడు. ‘స్పోర్ట్స్ టాక్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా ఈ వ్యాఖ్యలు చేశాడు.

“పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులను చూస్తే భారత జట్టు అక్కడికి వెళ్లకూడదనే నేను చెప్పాలి. అందుకే ఈ విషయంపై పాకిస్థాన్ ఆలోచించాలి. ఆ తర్వాత దీనిపై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌లో జరగాలని నేను భావిస్తున్నాను. దుబాయ్‌లో ఆడాలి. అప్పుడు మీడియా హైప్ కూడా లభిస్తుంది. టోర్నమెంట్ కచ్చితంగా హైబ్రిడ్ మోడల్ అవుతుంది’’ అని కనేరియా ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఆటగాళ్ల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, గౌరవం రెండవ ప్రాధాన్యత అని వ్యాఖ్యానించాడు. బీసీసీఐ చేయాల్సిన కృషి చేస్తుందని తాను భావిస్తున్నానని, తుది నిర్ణయాన్ని అన్ని దేశాలు ఒప్పుకుంటాయని  పేర్కొన్నాడు. 

ఇక 2023 వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, అందుకనే 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు పాక్ క్రికెట్ జట్టు ఇక్కడికి రావడం సులభమైందని కనేరియా అభిప్రాయపడ్డాడు. 

పాకిస్థాన్‌లో టోర్నీ నిర్వహిస్తే డబ్బులు రావడమే పెద్ద సమస్య అని, అందుకే భారత జట్టు వస్తుందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోందని అన్నాడు. భారత జట్టు పాకిస్థాన్ వస్తే స్పాన్సర్‌షిప్‌లు, మీడియా కవరేజీ పెరుగుతాయని కనేరియా అన్నాడు. కానీ సానుకూలంగా ఆలోచిస్తే పరిస్థితి బాగాలేదని, భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News