Shanthi Priya: అందుకే నన్ను ఎవరూ టచ్ చేయలేదు: భానుప్రియ సోదరి శాంతిప్రియ

Actress Shanthi Priya questions resignation of Mohanlal

  • సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్న హేమ కమిటీ నివేదిక
  • అన్ని చోట్ల లైంగిక వేధింపులు ఉన్నాయన్న శాంతిప్రియ
  • నీచ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య

మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి హేమ కమిటీ ఇచ్చిన నివేదిక పెను సంచలనం రేకెత్తించింది. ఈ కమిటీ నివేదిక దేశ వ్యాప్తంగా మరోసారి చర్చను లేవనెత్తింది. పలువురు సినీ ప్రముఖులు లైంగిక వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలనాటి హీరోయిన్, భానుప్రియ సోదరి శాంతిప్రియ కూడా ఈ అంశంపై స్పందించారు. 

మహిళలపై లైంగిక వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ కే పరిమితం కాలేదని... అన్ని చోట్లా ఇవి జరుగుతున్నాయని శాంతిప్రియ అన్నారు. ఇలాంటి నీచమైన ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన భవిష్యత్ తరాలకు భరోసాను కల్పించేలా ఈ చర్యలు ఉండాలని అన్నారు. 

మలయాళ పరిశ్రమపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సమయంలో... మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేయడం సరికాదని శాంతిప్రియ చెప్పారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం జరిగేందుకు అండగా నిలవాలని అన్నారు. ఇలాంటి కీలక సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. 

తనకు ఎప్పుడూ వేధింపులు ఎదురు కాలేదని శాంతిప్రియ తెలిపారు. తాను భానుప్రియ సోదరిని కావడం వల్లే తనను ఎవరూ టచ్ చేయలేదని చెప్పారు. ఇండస్ట్రీలో తమ కుటుంబానికి ఉన్న గౌరవం ఏమిటో అందరికీ తెలుసని అన్నారు. 1980-90ల్లో శాంతిప్రియ స్టార్ హీరోయిన్ రాణించారు.

  • Loading...

More Telugu News