Will Pucovski: అరంగేట్ర మ్యాచ్‌లోనే భార‌త్‌పై అద్భుత ఇన్నింగ్స్.. ఆసీస్‌కు మ‌రో బ్యాటింగ్ స్టార్ దొరికాడ‌నుకుంటే 26 ఏళ్లకే రిటైర్మెంట్‌!

Will Pucovski who scored 62 on debut against India is set to retire at 26 due to head injuries

  • 26 ఏళ్ల‌కే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విల్‌ పుకోవ్‌స్కీ
  • తలకు పదే పదే గాయాలవ్వడంతో చిన్న వ‌య‌సులోనే క్రికెట్‌కు గుడ్‌బై
  • అంత‌ర్జాతీయ కెరీర్‌లో కేవలం ఒక్క టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడిన యువ ఆట‌గాడు
  • 2021లో సిడ్నీ వేదిక‌గా భార‌త్‌పై అరంగేట్రం 
  • ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల‌తో ఆకట్టుకున్న పుకోవ్‌స్కీ

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఎంతో ప్ర‌తిభావంతుడైన‌ ఆట‌గాడు విల్‌ పుకోవ్‌స్కీ. ఆస్ట్రేలియాకు మ‌రో బ్యాటింగ్‌ స్టార్ దొరికాడంటూ ఎన్నో ప్రశంసలను అందుకున్నాడు. కానీ ఇప్పుడు పుకోవ్‌స్కీ ఆటకు  ముగింపు పలికాడు. తలకు పదే పదే గాయాలవ్వడంతో అత‌డు 26 ఏళ్ల‌కే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. వైద్య‌నిపుణుల ప్యానెల్ సలహా మేర‌కు పుకోవ్‌స్కీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో పుకోవ్‌స్కీ ఇప్పటివరకు కేవలం ఒక్క టెస్టు మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అది కూడా 2021లో భార‌త జ‌ట్టుపై ఆడాడు. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్ ద్వారానే అతడు అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీ (62 పరుగులు) తో ఆకట్టుకున్నాడు. కానీ అదే మ్యాచ్‌లో భుజానికి గాయం కావ‌డంతో ఆరు నెలలు ఆటకు దూరమయ్యాడు.

ఎంతో ప్రతిభావంతుడైన విల్ పుకోవ్‌స్కీ విక్టోరియన్ జ‌ట్టుకు ప్రాత‌నిధ్యం వ‌హించాడు. 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. త‌న ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో విక్టోరియా కోసం 36 మ్యాచ్ ఆడాడు. 45.19 స‌గ‌టుతో 2,350 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు వరుసగా దెబ్బలు తగలడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తను అప్సెట్ అయ్యాడు. పర్యవసానంగా 26 ఏళ్ల‌కే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో అతడి కెరీర్‌ పూర్తిగా ఇంకా మొదలు కాక ముందే ముగింపునకు వచ్చేసింది. 

అటు జనవరి 2017లో పాకిస్తాన్‌ టూర్‌లో లిస్ట్-ఏ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 14 లిస్ట్‌-ఏ మ్యాచుల్లో 333 పరుగులు చేశాడు. ఇక‌ 2020/21 సీజన్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ నుండి ఆహ్వానం అందుకున్నప్పటికీ ఒక్క టీ20 కూడా ఆడలేదు.

చివరగా పుకోవ్‌స్కీ 2024 మార్చిలో షెఫీల్డ్‌ షీల్డ్‌లో మ్యాచులో తలకు దెబ్బతగిలింది. ప్ర‌త్య‌ర్థి జట్టు బౌల‌ర్‌ రిలే మెరెడిత్ విసిరిన బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో ఆ తర్వాత సీజన్‌ మొత్తానికి అతడు దూరమవ్వాల్సి వచ్చింది. ఇక ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News